టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. తనలో శక్తి ఉన్నంతవరకూ క్రికెట్ ఆడుతూనే ఉంటానని చెప్పాడు. ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఆ తర్వాత విషయాలు దేవుడికి వదిలేస్తాను అని తెలిపాడు. తన గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేనని బుమ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. మూడో రోజు ఆట అనంతరం బుమ్రా మాట్లాడాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్న జస్ప్రీత్ బుమ్రా.. తరచూ గాయాల పాలవ్వడం ఆందోళన కలిగించే విషయం. గాయాల కారణంగా ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడన్న విమర్శలు ఎదుర్కొన్న బుమ్రా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం, పట్టుదలే అతడిని గొప్ప పేసర్‌గా నిలిచేలా చేశాయి. గాయాల బారిన పడినప్పుడు వచ్చిన విమర్శలపై తాజాగా బుమ్రా స్పందించాడు. ‘బయటి వ్యక్తులు నిత్యం ఏదో ఒకటి అంటుంటారు. ఇన్ని ఏళ్లుగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నారు. కొందరు అయితే నేను 8 నెలలు మాత్రమే ఆడగలనన్నారు. మరికొందరు 10 నెలలు మాత్రమే అన్నారు. ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. మరోవైపు 12-13 ఏళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతున్నాను’ అని బుమ్రా అన్నాడు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
‘నేను గాయాల బారిన పడిన ప్రతిసారీ నా కెరీర్ ముగిసిందని కొందరు అంటుంటారు. ఎవరు ఏమనుకున్నా.. నా పని నేను చేసుకుంటూ వెళ్తా. నా విషయంలో ప్రతి నాలుగు నెలలకు ఓసారి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఒకటి మాత్రం చెప్పగలను.. నాలో శక్తి ఉన్నంతవరకూ నేను ఆడుతూనే ఉంటా. నా ఉత్తమ ప్రతిభను ఇవ్వడానికి నిత్యం సిద్ధంగా ఉంటా. ఆ తర్వాత విషయాలు దేవుడికి వదిలేస్తా. నా గురించి మాట్లాడుకునే వారిని నియంత్రించలేను. నా గురించి ఏం రాయాలో అని నేను సలహా ఇవ్వలేను. వ్యూయర్‌షిప్ కోసమే నాపై కథనాలు రాస్తుంటారు. వాటి గురించి నేను బాధపడను’ అని జస్ప్రీత్ బుమ్రా చెప్పుకొచ్చాడు. బుమ్రా భారత్ తరఫున ఇప్పటివరకు 45 టెస్టులు, 89 వన్డేలు, 70 టీ20లు ఆడాడు.