Abhimanyu Eswaran Father Slams BCCI Selectors Over Test Snub: ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ త్వరలో ముగియనుంది. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ టెస్ట్ సిరీస్‌లో టీమిండియాలోని ముగ్గురు ప్లేయర్స్ మాత్రమే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అందులో ఉత్తరాఖండ్‌కు చెందిన అభిమన్యు ఈశ్వరన్ ఒకడు. కొద్ది రోజుల క్రితమే భారత జట్టులోకి వచ్చిన బౌలర్ అన్షుల్ కాంబోజ్ కూడా అరంగేట్రం చేసినా.. అభిమన్యుకు మాత్రం ఇంకా ఆడే అవకాశం దక్కలేదు. దేశవాళీలో భారీగా పరుగులు చేసినా.. తన కొడుకుకు జట్టులో స్థానం దక్కకపోవడంపై అభిమన్యు తండ్రి అసహనం వ్యక్తం చేశారు. మా అబ్బాయికి ఇక అవకాశం ఇవ్వరా? అని మండిపడ్డారు.
అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ఫైర్ అయ్యాడు. ‘అభిమన్యు ఈశ్వరన్ తన టెస్ట్ అరంగేట్రం కోసం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలి. రోజులు కాదు.. సంవత్సరాలు లెక్క పెడుతున్నా. ఇప్పటికే మూడు సంవత్సరాలు అయ్యింది. ఓ ఆటగాడి పని ఏంటి పరుగులు చేయడం, అది అభిమన్యు చేస్తున్నాడు కదా?. గత ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా A తరఫున రెండు మ్యాచుల్లో మంచి ప్రదర్శన ఇవ్వలేదని కొందరు అంటున్నారు. ఇది ఓకే. అభిమన్యు బోర్డర్ – గవాస్కర్ ముందు మంచి ప్రదర్శన ఇచ్చిన సమయంలో కరుణ్ నాయర్ అసలు జట్టులో లేడు. దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీకి కరుణ్ ఎంపిక కూడా కాలేదు. అభిమన్యు 864 పరుగులు చేశాడు. గతేడాది, ప్రస్తుత ఏడాది ప్రదర్శనను పోల్చడం సరైందేనా?’ అని రంగనాథన్ మండిపడ్డారు.
‘ఈ ఏడాది కరుణ్ నాయర్ 800 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. బీసీసీఐ సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. మరి నా కుమారుడికి అవకాశం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నా. అవకాశం ఇస్తేనే కదా?.. ఎలా ఆడుతారో తెలిసేది. ఐపీఎల్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. టెస్ట్ ఫార్మాట్లో ఐపీఎల్ ప్రదర్శనను ఎలా పరిగణిస్తారు. ఈ సిరీస్‌లో జట్టుతో పాటే ఉంటోన్న నా కొడుకు అభిమన్యు ఈ పరిణామాలతో డిప్రెషన్లోకి వెళ్లాడు. టెస్టు జట్టు కోసం ఎంపిక చేసేటప్పుడు తప్పకుండా దేశవాళీ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవాలి. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ ప్రదర్శలను టెస్ట్ ఎంపికకు ప్రామాణికంగా చూడాలి’ అని అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు 103 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 48.70 సగటుతో 7841 రన్స్ చేశాడు. ఇందులో 27 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 89 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 47.03 సగటుతో 3857 రన్స్ బాదాడు. ఇందులో 9 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 34 టీ20 మ్యాచ్‌లలో 37.53 సగటుతో 973 రన్స్ చేశాడు. పొట్టి క్రికెట్లో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిమన్యు 2021లో తొలిసారి భారత టెస్ట్ జట్టులోకి వచ్చినా.. ఇప్పటివరకు అరంగేట్రంకు నోచుకోలేదు. అభిమన్యు తర్వాత వచ్చిన 16 మంది ప్లేయర్స్ కెరీర్‌ను ప్రారంభించడం ఇక్కడ విశేషం.