విద్యుత్ సంక్షోభంతో చైనాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఇండియాలో కూడా రానుందా…? అనే చర్చ మొదలైంది.. దేశంలో వినియోగిస్తున్న విద్యుత్ లో 70 శాతం విద్యుత్ ని బొగ్గుతోనే తయారు చేస్తున్నారు. ఇక బొగ్గు ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్రభుత్వ పవర్ ప్లాంట్ లలో గత కొన్ని రోజులుగా బొగ్గు నిల్వలు అడుగంటిపోతున్నాయి. దేశంలో 130 కి పైగా థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటే వాటిలో 70 కి పైగా థర్మల్ స్టేషన్స్ లలో మూడు రోజులకు మాత్రమే బొగ్గు ఉందని కేంద్రం చెప్తుంది.. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఇక వీటిలో సగానికి పైగా ప్రభుత్వ విద్యుత్ థర్మల్ స్టేషన్స్ ఉండటం గమనార్హం. బొగ్గు నిల్వలు ఆగస్ట్ చివరినాటికి 13 రోజులకు సరిపడా మాత్రమే ఉండగా, గత నెల చివారినాటికి ఇది మరింతగా దిగజారి నాలుగు రోజులు మాత్రమే సరిపడా నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది.
నాలుగు రోజులకు మాత్రమే సరిపడే స్థాయిలో బొగ్గు నిల్వలు లేకపోవడం గత కొన్ని సంవత్సరాలుగా ఇదే తొలిసారి. సెప్టెంబర్ చివరి నాటికి థర్మల్ పవర్ ప్లాంట్స్ వద్ద ఉన్న బొగ్గు నిల్వలు దాదాపు 80 లక్షల టన్నులకు తగ్గిపోయాయని ప్రభుత్వ రికార్డ్స్ చెప్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే అది 76 శాతం తక్కువ. ఇక ప్రస్తుతం ఒక్కో పవర్ ప్లాంట్ వద్ద దాదాపు 60వేల నుంచి 80వేల టన్నుల బొగ్గు కొరత ఉంది. ప్రస్తుతం కావాల్సిన మోతాదులో విద్యుత్ ఉత్పత్తి చెయ్యడానికి థర్మల్ ప్లాంట్స్ దగ్గర బొగ్గు నిల్వలు సరిపోవు. ఇక, కరోన కాలంలో చాలా పరిశ్రమలు మూసేశారు, ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో పరిశ్రమలన్ని తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. దీంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. అయితే భారీ వర్షాలతో గనులు, కీలక రవాణా మార్గాలను వరదలు ముంచెత్తడంతో.. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు భారీగా పడిపోయాయి. గత నెల చివరినాటికి సగటున నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో.. దేశంలో సగం కంటే ఎక్కువ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
మరో వైపు దేశంలో కావాల్సినంత బొగ్గు ఉందని, కాకపోతే కొన్ని ప్లాంట్స్ లలో బొగ్గు కొరత ఏర్పడిందని, దేశంలో కరోన ఉద్రిక్తత తగ్గడంతో ఫ్యాక్టరీలన్నీ తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, దీంతో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగడంతో పాటు, వర్షాల కారణంగా బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడటంతో థర్మల్ కేంద్రాలకు బొగ్గు సరఫరా నిలిచిందని త్వరలోనే పునరుద్ధరణ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.. పవర్ ప్లాంట్స్ లల్లో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పునరుద్ధరణ అయ్యే వరకు విద్యుత్ కోతలు తప్పేలా కనిపించడం లేదు. ఇక ఇదే కొనసాగితే విద్యుత్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. పవర్ ప్లాంట్స్ కి బొగ్గు సరఫరా లేకపోతే ఆ ప్రభావం వినియోగదారులపైన పడుతుంది.