NTV Telugu Site icon

PM Modi: దేశ చరిత్రలో ‘ఎమర్జెన్సీ’ ఒక మచ్చ.. ఆ పొరపాటు మళ్లీ జరగొద్దు

Modi

Modi

18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం కొత్త పార్లమెంట్‌ భవనంలో జరుగుతోంది. కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ ప్రధాని మోడీ హృదయపూర్వకంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

Read Also: Kodanda Reddy: ఇది చారిత్రక నిర్ణయం.. మాటకు కట్టుబడి సీఎం రుణమాఫీ చేస్తున్నారు..

18వ లోక్‌సభ ఏర్పాటు వల్ల సామాన్య ప్రజల సంకల్పం నెరవేరుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కొత్త ఉత్సాహంతో కొత్త ఊపును, కొత్త ఎత్తులను సాధించడానికి ఇది చాలా ముఖ్యమైన అవకాశం. 2047 నాటికి మెరుగైన భారతదేశాన్ని, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 18వ లోక్‌సభ ఈరోజు ప్రారంభమవుతుందని మోడీ తెలిపారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే దేశ ప్రజలు వరుసగా మూడవసారి ప్రభుత్వానికి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. ఇది స్వతహాగా చాలా గర్వించదగ్గ విషయం. రాజ్యాంగ గౌరవాన్ని పాటిస్తూనే నిర్ణయాలను వేగవంతం చేయాలనుకుంటున్నాను. సభ్యులందరినీ కలుపుకొని 2047 వికసిత భారత్‌ సంకల్పం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని మనమంతా ముందుకెళ్దాం’’ అని ఎంపీలకు పిలుపునిచ్చారు. 18వ లోక్‌సభలో యువ ఎంపీల సంఖ్య బాగానే ఉందని ప్రధాని మోడీ తెలిపారు. భారతీయ సంస్కృతి, వారసత్వంలో 18వ సంఖ్యకు గొప్ప సాత్విక విలువ ఉందని చెప్పారు.

Read Also: Renuka Swamy: రేణుకా స్వామి నాకు కూడా అసభ్యకరమైన మెసేజులు పంపాడు.. మరో కన్నడ నటి సంచలనం!

ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’ గురించి ప్రస్తావించారు. భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై నమ్మకం ఉన్నవారికి జూన్ 25 మరపురాని రోజు అని తెలిపారు. భారత ప్రజాస్వామ్యం జూన్ 25తో తుడిచిపెట్టుకుపోయి 50 ఏళ్లు పూర్తవుతోంది. దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని మోడీ పేర్కొన్నారు. తమ బాధ్యతలు మూడు రెట్లు పెరిగాయి.. మూడో టర్మ్‌లో మూడు రెట్లు కష్టపడి పనిచేస్తామని దేశప్రజలకు హామీ ఇస్తున్నానని మోడీ తెలిపారు. కొత్త ఎంపీల పట్ల దేశం చాలా అంచనాలు పెట్టుకుందని ప్రధాని మోడీ చెప్పారు. ప్రజాప్రయోజనాలు, ప్రజా సేవ కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరారు. అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన సంకల్పాన్ని నెరవేర్చడం మనందరి బాధ్యత. అందరూ కలిసి ఆ బాధ్యతను నిర్వర్తించాలని మోడీ తెలిపారు.

Show comments