Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!

Eluru Mayor War

Eluru Mayor War

TDP and Jana Sena Eye on Eluru Mayor Seat: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అధికార కూటమిలోని జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. మేయర్ పదవి తమకే దక్కాలంటూ ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఏలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేనకు ఏలూరు మేయర్ కేటాయిస్తారనే ఊహాగానాలతో.. రంగంలో దిగిన టీడీపీ నేతలు తమ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఏలూరు మెయిన్ పీఠం ఎవరికి దక్కుతుందని అంశంపై ఆసక్తి కొనసాగుతోంది.

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి తరఫున మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీల నిర్ణయాలను పరిశీలించిన అనంతరం అభ్యర్థి ఎంపికపై వైసీపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మేయర్ పదవికి సంబంధించి టీడీపీ, జనసేన మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? లేదా చివరి వరకు పోటీ కొనసాగుతుందా? అన్నది వేచి చూడాలి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఏలూరు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరోవైపు ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూడా పోటీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. పెదవేగి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయడానికి ఆమె సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి తన పేరును పరిశీలించాలని కోరుతూ టీడీపీ ఎన్నికల పరిశీలకురాలు పంచుమర్తి అనురాధకు నవ్యశ్రీ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు సమాచారం. జెడ్పీటీసీగా ఎన్నికై, అనంతరం చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఆమె రాజకీయంగా ముందడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఒకవైపు మేయర్ పీఠం కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ.. మరోవైపు జడ్పీ చైర్మన్ పదవిపై ఆశావహుల ప్రయత్నాలతో ఏలూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.