NTV Telugu Site icon

Elon Musk X: ఇకపై ‘ఎక్స్‌’ ఉచితం కాదు.. డబ్బులు కట్టాల్సిందే!

Twitter

Twitter

X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్‌ (ట్విటర్‌)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్‌ మస్క్‌.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్‌ ఉచితం కాదని, ఎక్స్‌ వాడాలంటే ప్రతి యూజర్‌ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్‌ వెల్లడించారు. ఇజ్రాయెల్‌ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను పరీక్షించేందుకు ఎక్స్‌ సిద్ధమైందని, ప్రస్తుతానికి ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీని ప్రయోగాత్మకంగా న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో అందుబాటులోకి తెచ్చామని మస్క్‌ పేర్కొన్నారు.

‘నాట్ ఎ బాట్’ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ దేశాలలో ఈరోజు నుండి ప్రారంభమవుతుంది. కొత్తగా ఎక్స్‌ ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి 1 డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌ వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీపోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్‌ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్‌ చేయడం లాంటి ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి.. పోస్ట్‌లను చదవడం ఫొటోలు-వీడియోలు చూడ్డానికి ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి దీన్ని కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేసింది. ఇప్పటికే ఎక్స్‌ ఖాతా ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఎక్స్‌లో నకిలీ ఖాతాల బెడదపై ఎలాన్‌ మస్క్‌ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ ఖాతాలను అరికట్టడం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టారు. తాజాగా తీసుకొస్తున్న సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందులో భాగమేనని. దీని వల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు దేశాన్ని బట్టి మారతాయి. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా సభ్యత్వ రుసుము ప్రారంభించబడుతుందని, ఇప్పటికే ఉన్న వినియోగదారులను దాని పరిధిలోకి తీసుకురావచ్చని సమాచారం.

Also Read: IND Playing 11 vs BAN: శార్దూల్, సిరాజ్ ఔట్.. బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగే భారత్ తుది జట్టు ఇదే!

ఇప్పటికే ‘ఎక్స్‌ ప్రీమియం’ పేరిట ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్స్‌ అందుబాటులో ఉంచింది. దీని వల్ల యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్‌ చేయడం, సుదీర్ఘ సందేశాలను పోస్ట్‌ చేయడం, ఫోల్డర్ల బుక్‌ మార్క్‌, యాప్‌ ఐకాన్‌ను మార్చుకోవడం చేసుకోవచ్చు.