Electrical Vehicles Tax Benefit:భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) జోరు పెరిగింది. గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాల్లో ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో వినియోగదారుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాడు. ద్విచక్ర వాహనాలతో పాటు కార్లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న కాలంలో ఛార్జింగ్ సమస్యలు తీరేలా మౌళిక సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తోంది ప్రభుత్వం. సాధారణంగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే.. ఈవీ వాహనాల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నా కూడా.. లాంగ్ రన్ లో వీటి నిర్వహణ వ్యయం అనేది తక్కువ.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తక్కువగా ఉంటుంది. 80EEB కింద ఆదాయపన్నును ఆదా చేసుకోవచ్చు. మామూలుగా పెట్రోల్, డిజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల్లో జీఎస్టీ తక్కువగా ఉంటుంది. వాహనం కొనుగోలుపై కేవలం 5 శాతం జీఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు.
టాక్స్ బెనిఫిట్స్:
ఒక వేళ మీరు వ్యక్తిగతంలో ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే 80EEB( ఇంట్రెస్ట్ లోన్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికిల్స్) కింద వాహనం పన్ను మినహాయింపులను పొందవచ్చు. బ్యాంకు లేదా మరేదైనా ఆర్థిక సంస్థ ద్వారా అయినా లోన్ తీసుకుని ఈవీని కొనుగోలు చేస్తే కొన్ని మినహాయింపులను వర్తిస్తాయి. లోన్ తీసుకున్న మొత్తానికి గరిష్టంగా ప్రతీ ఏడాది రూ.1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపు పొందవచ్చు. ఇది టూవీలర్, త్రీవీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తిస్తుంది. రిజిస్టర్ బ్యాంకు, ఎన్బీఎఫ్సీ ద్వారా రుణాలు పొందితేనే ఈ మినహాయింపులను పొందవచ్చు. ఎప్రిల్ 1, 2019 నుంచి మార్చి 30, 2023 వరకు లోన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి మాత్రమే 80EEB కింద ఈ మినహాయింపులు ఇవ్వనుంది. ఈ కాలం పరిధిలో ఈవీలను కొనుగోలు చేసినవారు మాత్రమే వడ్డీ చెల్లింపును క్లెయిమ్ చేయవచ్చు.
వీటితో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈవీ పాలసీలను తీసుకువచ్చాయి. రాష్ట్రాల తరుపున కొన్ని ప్రయోజనాలను ఈవీ కొనుగోలుదారులకు ఇస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాలు ఈవీలు కొనుగోలు చేసిన వారికి కొన్ని రాయితీను ప్రకటించాయి.