రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఏపీలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచారు. అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
READ MORE: Mahesh Babu : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు గాను దాదాపు 572 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలు అయినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది. 38 నామినేషన్ల దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు నామినేషన్ల పరిశీలన, ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు తీసుకున్నారు. అనంతరం ప్రక్రియ ముగిసిందని ప్రకటించారు. 25 లోక్ సభ స్థానాలకు గానూ 731 అభ్యర్థులు బరిలో దిగారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించనున్నారు.. అధికారులు. ఈనెల 29 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మే 13న పోలింగ్ జరగనుండగా..జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.