NTV Telugu Site icon

Krishna District: పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

Kirshna

Kirshna

Krishna District: కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరు కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ వెల్లడించారు. జిల్లాలో మొత్తం ఓట్లు 15,39,460 ఉండగా.. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 12,93,948 ఓట్లు పోలయ్యాయన్నారు. ప్రతి టేబుల్‌కు ఒక అదనపు ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక కౌంటింగ్ అబ్జర్వర్ లను నియమించామన్నారు.

Read Also: Constable Suicide: ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్య

రౌండ్ల వారి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. మచిలీపట్నం అసెంబ్లీ స్థానం ఫలితాలు 15 రౌండ్లు, పెడన అసెంబ్లీ స్థానానికి 16 రౌండ్లు.. గుడివాడ, పామర్రు అసెంబ్లీ స్థానాలకు 17 రౌండ్లు, అవనిగడ్డ అసెంబ్లీ ఫలితం 20 రౌండ్లు, గన్నవరం పెనమలూరు అసెంబ్లీ స్థానాలకు 22 రౌండ్ల లెక్కింపు చేపట్టనున్నామన్నారు. తొలి ఫలితం పెడన తదుపరి మచిలీపట్నం ఫలితం వచ్చే అవకాశం ఉందన్నారు. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి మొత్తం 21,579 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయన్నారు. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో మొత్తం 21,728 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయన్నారు.

Read Also: Kadapa SP: కౌంటింగ్ నేపథ్యంలో కడప నగరంలో ఆంక్షలు

మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్ళు ఏర్పాటు చేశామన్నారు. 7 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు పామర్రు 2 టేబుల్స్ , పెడన 3 టేబుల్స్ , గన్నవరం 5 టేబుల్స్, గుడివాడ, పెనమలూరు 6 టేబుల్స్ చొప్పున, మచిలీపట్నం, అవనిగడ్డ 8 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. అందులో మూడు సెక్షన్ల కేంద్ర బలగాలు, మూడు సెక్షన్ల రాష్ట్ర సాయుధ దళాలు, రాష్ట్ర సివిల్ పోలీస్ బలగాలతో నిరంతరం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం 110 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఉంటాయన్నారు. రౌండ్ వారి ఫలితాలను ప్రకటించేందుకు కమ్యూనికేషన్ రూమును, మీడియా కవరేజ్ కోసం మీడియా సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రథమ చికిత్స కోసం వైద్య శిబిరాన్ని కూడా ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. అగ్ని ప్రమాద నివారణకు అగ్నిమాపక శకటాలు, సంబంధిత పరికరాలతో సిబ్బందిని సిద్ధంగా ఉంచామన్నారు. కౌంటింగ్ సిబ్బంది, మీడియా వారికి కృష్ణ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ఎదుట పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేశామన్నారు. రుద్రవరం గురుకుల పాఠశాల వద్ద అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు.