CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మహిళపై లైంగిక వేధింపుల వ్యవహారంలో.. ఎడిట్ చేసిన వీడియోను సాధారణ పౌరులకు చూపించారని ఆమె ఆరోపణలు చేశారు. అసలు వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. వాటిలో దిగ్భ్రాంతికర విజువల్స్ ఉన్నాయన్నారు. గవర్నర్ పదవికి ఎందుకు రాజీనామా చేయనక్కర్లేదో ఆనంద బోస్ స్వయంగా వివరణ ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున హుగ్లీ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న రచనా బెనర్జీకి మద్దతుగా శనివారం సప్తగ్రామ్‌లో సీఎం మమత బెనర్జీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
Read Also: PM Modi : పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ రోడ్‌షో.. ఊహించని విధంగా ప్రజల స్వాగతం
ఈ సందర్భంగా సీవీ ఆనంద బోస్ గవర్నర్‌గా ఉన్నంత కాలం తాను రాజ్‌భవన్‌కు వెళ్లనని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేసింది. తప్పని సరి అయితే వీధుల్లోనే ఆయన్ను కలుస్తానంటూ చెప్పుకొచ్చింది. ఆనంద బోస్ పక్కన కూర్చోవడం కూడా పెద్ద పాపమేనంటూ దీదీ ఘాటుగా విమర్శలు గుప్పించింది. దీదీగిరిని సహించబోనని గవర్నర్ బోస్ అంటున్నారు. కానీ, ఆయన దాదాగిరీ ఇక్కడ పని చేయదన్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన వెంటనే గవర్నర్ పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేసింది. మహిళపై తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెబుతున్న మే 2వ తేదీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సాధారణ పౌరులకు బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చూపించారు. దీనిపై బాధితురాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోలో తన ముఖాన్ని బ్లర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయబోతున్నట్లు బాధిత మహిళ వెల్లడించింది.