Liquor Scam: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీగా లిక్కర్ అక్రమాలు జరిగాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటింది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంలో భారీ అవినీతి బట్టబయలైనట్టు ఈడీ ఆరోపణలు చేసింది. ఏకంగా రూ.2వేల కోట్ల అవినీతిని గుర్తించినట్టు వెల్లడించింది. ఈ అవినీతి సొమ్మును ఎన్నికలకు మళ్లిస్తున్నట్లు ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కాంలో కాంగ్రెస్ నేత, రాయ్‌పూర్ మేయర్ ఐజాజ్ ధేబర్ సోదరుడు అన్వర్ ధేబర్‌ను ఈడీ మే 6న అరెస్టు చేసింది. ఈ సందర్భంగా మనీ లాండరింగ్‌కు సంబంధించిన ఆధారాలను కనుగొన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి మద్యం సీసాపై అక్రమ లాభార్జన ధ్యేయంగా భారీగా జరిగిన అవకతవకల్లో ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు ఉన్నట్లు ఈడీ తెలిపింది. 2019-2022 మధ్యకాలంలో రూ.2వేల కోట్ల మేర భారీ అవినీతి చోటుచేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఐఏఎస్ అధికారి అనిల్ టుటేజా ఇందులో కీలక పాత్ర పోషించారని, రాయ్‌పుర్ మేయర్ సోదరుడైన అన్వర్ ధేబర్ హస్తం కూడా ఇందులో ఉన్నట్లు పేర్కొంది.
Read Also: Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
తాము జరిపిన విచారణలో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాల్లో 30-40 శాతం అక్రమంగానే సాగినట్లు ఈడీ పేర్కొంది. రాయ్‌పుర్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో శనివారం ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ.. మద్యం వ్యాపారి అన్వర్ ధేబర్ రిమాండ్‌కు ఆదేశించాలని కోర్టును కోరింది. శనివారం రాయ్‌పుర్‌లోని ఓ హోటల్‌లో అన్వర్ ధేబర్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. హవాలా ప్రత్యేక కోర్టు ఆయనను నాలుగు రోజుల ఈడీ కస్టడీకి ఆదేశించింది. ఏడుసార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా బినామీ సిమ్‌కార్డులు మారుస్తూ తప్పించుకొంటున్నందున అన్వర్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో ఐఏఎస్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనిల్ టుటేజా ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉన్నారు.