అప్పట్లో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. అయితే, ఈ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది.. గతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను విచారించిన ఈడీ.. కెల్విన్, పీటర్, కమింగా నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది.. ముగ్గురి స్టేట్‌మెంట్ ల ఆధారంగా విచారణనులో దూకుడు పెంచింది.. కెల్విన్ స్టేట్‌మెంట్ ఆధారంగానే సినీ నటులకు నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, డ్రగ్స్ తీసుకుని హవాలా రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా ముగ్గురు తెలిపిన ముగ్గురు నిందితులు.. విదేశాల నుంచి డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ తీసుకు వచ్చినట్లుగా నిందితులు తెలిపారు. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బులు పంపినట్లు కెల్విన్ తెలిపినట్టుగా అధికారులు చెబుతున్నారు.
ఇక, హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా జరిగినట్టుగా ఈడీ అధికారులు చెబుతున్నారు.. నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా.. ఎఫ్ క్లబ్ మేనేజర్‌కు కూడా నోటీసు జారీ చేసింది ఈడీ.. డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేశారని విషయాన్ని క్లబ్ మేనేజర్ ద్వారా తెలుసుకునేందుకు సిద్ధం అవుతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మరోవైపు.. కెల్విన్, పీటర్, కమింగాకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలతో పాటు ఆన్‌లైన్ లావాదేవీల వివరాలను ఇప్పటికే తెప్పించింది ఈడీ.. కాగా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైన ఈడీ.. ఇప్పటికే ఏరోజు ఎవరు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.