కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
గత జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలకు 49 వైసీపీ, ఒకస్థానం టీడీపీ దక్కించుకున్నాయి. ఎన్నికల అనంతరం ఇద్దరు జడ్పీటీసీలు మృతి చెందారు. 48 జడ్పీటీసీలకు గాను ఒక జడ్పీటీసీ తన పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 6 మంది జడ్పీటీసీలు టీడీపీలో చేరగా, ఒకరు బీజేపీలో చేరారు. దీంతో కూటమికి 8 మంది జడ్పీటీసీల బలం చేకూరింది.
ప్రస్తుతం కడప జిల్లా పరిషత్ లో వైసీపీకి 39 మంది జడ్పీటీసీల బలం ఉంది. అయితే వైసీపీ నుంచి బ్రహ్మంగారిమఠం మండల జడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని అభ్యర్థిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దాదాపు వైసీపీకి జడ్పీ పీఠం కైవసం అయ్యే అవకాశం ఉంది. అయితే వైసీపీలోని అసంతృప్తి జడ్పీటీసీలను తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది.