మల్కాజ్‌గిరి ప్రజల మనస్సులో ఉన్నమాటల్నే మాజీ మంత్రి మల్లారెడ్డి నాతో చెప్పారు. రెండు లక్షల పై చిలుకు ఓట్లతో మీరు గెలవబోతున్నాంటూ అనేక మంది ఇప్పటికే నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. మల్లారెడ్డి తన మనస్సులో మాటలు దాచుకోలేక నాతో అన్నా నీవే గెలవబోతున్నావంటూ ముందస్తుగా చెప్పారంతే. ఇంతమంది ఓబీసీ మంత్రులు గత కేంద్ర ప్రభుత్వాలలో ఎన్నడూ లేరు. 12 మంది దళిత మంత్రులు ఉన్నారు. 8 మంది ట్రైబల్ మినిష్టర్లు ఉన్నారు. 5 మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఒక మహిళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీపై ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయి. మరో సారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కల వచ్చిందా. అనేక స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గుల్ల చేసి, ఇలాంటి పిచ్చి ప్రకటనలు, వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరు.
ఇదిలా ఉంటే.. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, బల్చిస్తాన్ ప్రాంత ప్రజలు మేము కూడా భారత్‌తో కలిసి ఉంటే బాగుండనని అనుకుంటున్నారని తెలిపారు. ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్స్‌లో ఒకరిగా మోదీ స్థానం సంపాదించుకున్నారనీ, ప్రపంచాన్ని శాసించిన రష్యా మన జోక్యం కోరుకునే స్థాయికి ఎదిగిందన్నారు. మోదీ ప్రజల సెంటిమెంట్ రామమందిరం కట్టి జాతికి అందించారనీ తెలిపారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు కూడా న్యాయం చేశారనీ ఈటెల స్పష్టం చేశారు. ఒక్కసారి గెలిచాక రెండవసారి గెలవడమే కష్టం కానీ మోదీకి మూడవసారి కూడా ఓట్లు వేస్తామని ప్రజలే చెప్తుండడం గొప్ప విషయమన్నారు. జీఎస్టీని అమలు చేయాలని పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు కానీ, చేయలేకపోయారు, మోడీ మాత్రం భయపడకుండా తక్షణమే అమలు చేసి రూ.73 వేల కోట్ల ఆదాయాన్ని లక్షా.80 వేల కోట్లకు పెంచారని చెప్పారు.