Earthquake: జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదు

Earthquake

Earthquake

Earthquake: జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్‌వార్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల్లో జమ్ముకశ్మీర్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1న 3.8 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో కశ్మీర్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ నెల 5న అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో జమ్ముకశ్మీర్‌తోపాటు, ఢిల్లీలో కూడా భూకంపం వచ్చింది.

Read Also: Bus Crash Kills 40 : సెనెగల్‎లో ఘోర ప్రమాదం.. 40మంది ప్రయాణికుల మృతి

ఆదివారం పసిఫిక్ మహాసముద్రంలోనూ భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ ద్వీపదేశం వనౌటు తీరానికి సమీపంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైంది. పోర్ట్ ఓల్రీ అనే గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో 27 కిమీ లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. భారీ ప్రకంపనలతో వనౌటుతో పాటు, న్యూకలెడోనియా, సాల్మన్ ఐలాండ్స్ కు కూడా సునామీ హెచ్చరిక జారీ అయింది. దాంతో ప్రజలు సమీపంలోని ఎత్తయిన ప్రదేశాలకు పరుగులు తీశారు. అయితే, కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ తీర ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలని వనౌటులోని ఫ్రెంచ్ దౌత్యకార్యాలయం సూచించింది.