దువ్వాడ మాధురి, అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్ ఎదురైంది. అప్పన్న కనిపించడం లేదంటూ ఆయన సతీమణి శ్రీకాకుళం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం (డిసెంబర్ 29) నుంచి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరో ఇద్దరు వచ్చి తన భర్త అప్పన్నను తీసుకెళ్లారని ఎస్పీకి చెప్పారు. ఎంక్వయిరీ కోసం తీసుకెళ్లారా? లేదా కిడ్నాప్ చేశారా? అనేది త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని కన్నీరు మున్నీరయ్యారు. రాజకీయాలకు తాము బలైపోయామని అప్పన్న భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి సొంతూరు నిమ్మాడలో అడుగు పెట్టలేకపోతున్నామని ఎస్పీకి చెప్పారు.
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి రిలీజ్ చేసిన ఓ ఆడియో రికార్డింగ్ పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు అప్పన్నకు, మాధురికి మధ్య సంభాషణనే ఆ ఆడియో రికార్డింగ్. దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్లాన్ చేసినట్లు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు అప్పన్న చెప్పారు. నరసన్నపేట లేదా నిమ్మాడ జంక్షన్ వద్ద దాడి జరిగే అవకాశం ఉందని మాధురితో అప్పన్న చూపినట్లు అందులో ఉంది.