Dudekula Simha Garjana: చట్టసభల్లో స్థానమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో నూర్ బాషా దూదేకుల సింహగర్జన కార్యక్రమం జరుగుతోంది. వైసీపీ యువనేత జాన్ సైదా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి భారీగా వచ్చిన నూర్ బాషా సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చట్ట సభల్లో స్థానం డిమాండ్ చేస్తూ నూర్ బాష నేతలు బలప్రదర్శన చేస్తున్నారు.
30 లక్షల జనాభా.. 15 లక్షల ఓటర్లు ఉన్న సామాజిక వర్గానికి చట్ట సభల్లో స్థానం కోసం పోరాటం చేస్తున్నారు నూర్ బాషా నేతలు. ఇంత మంది జనాభా ఉన్నా ఇప్పటి వరకూ చట్ట సభలో చోటు దక్కలేదని వారు పోరాటం చేస్తున్నారు. ముస్లింలకు సీఎం జగన్ అన్ని అవకాశాలు ఇస్తున్నారని.. అందులో మాకు స్థానం కావాలని నూర్ బాషా సామాజిక వర్గానికి చెందిన నేతలు అంటున్నారు. ముస్లింలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో చట్ట సభలో అవకాశం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి చట్ట సభల్లో స్థానం కోసం నూర్ బాషా సామాజిక వర్గం ప్రయత్నాలు చేస్తోంది. సీఎం జగన్ తప్ప ఇంకెవరూ మాకు న్యాయం చేయరని అంటున్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు.