NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టే కాంగ్రెస్‌కి పట్టం కట్టారు

Sridhar Babu

Sridhar Babu

కొత్త సంవత్సరంలో ప్రజలతో పాటు.. మా ప్రతిపక్ష సభ్యులు కూడా బాగుండాలన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన 36 రోజుల తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు పెట్టారన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. ప్రజల తీర్పును బాధ్యతారాహిత్యంగా చేశారు కాబట్టి.. కాంగ్రెస్ కి పట్టం కట్టారని, ప్రజల తీర్పు గౌరవిస్తూ 48 గంటల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. ఆరున్నర కోట్ల మంది మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు వసతి కల్పించామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతల తీరు.. నవ్విపోదురు గాకా.. నాకేంటి సిగ్గు అన్నట్టు ఉందని మంత్రి శ్రీధర్‌ బాబు ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలను చూస్తుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది.. జాలి వేస్తోందన్నారు. అధికారం వాళ్ళకే సొంతం.. ఇంకా ఎవరు పాలించొద్దు అనే ధోరణి లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓటమి తర్వాత.. ప్రజల నాడీ అర్థం చేసుకుంటాం అని అనుకున్నామని, కానీ వారి వ్యవహారం మాత్రం మారలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై ఓ బుక్ తీశారు.. దానిపై మా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నామన్నారు.

2014 నుండి 2023 వరకు బీఆర్‌ఎస్‌ పరిపాలనే చేశారని, బీఆర్‌ఎస్‌ 3500 రోజులు పాలించింది.. కాంగ్రెస్ వచ్చి 30 రోజులు కాలేదని ఆయన అన్నారు. 30 రోజులను కూడా ఓర్వలేకుండా పొయిందని, విష ప్రచారం చేస్తుంది బీఆర్‌ఎస్‌ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అంతా తొందరపాటు.. ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏడాది తర్వాతనో.. బీఆర్‌ఎస్‌ వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే దానికో అర్థం ఉందని, మీరు ఎన్నికల్లో ముస్లిం రిసేర్వేషన్ ఇస్తామని.. అవినీతి కి పాల్పడితే కొడుకైనా.. బిడ్డనైన జైల్లో పెడతా అన్న కేసీఆర్ ఏం చేశారన్నారు. కేంద్రం నుండి రావాల్సిన ఐఐఎం, ఐటీఐఆర్‌ ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. ఎవరు 420.. ఎవరు డబుల్ 420 అనేది ప్రజలే భేరీజు వేసుకుంటారని, బీఆర్‌ఎస్‌ కి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక.. ఆవేదనలో మట్లాడుతున్నారన్నారు. తెలంగాణ పాలిట పాపం.. శాపం బీఆర్‌ఎస్‌ అని మంత్రి శ్రీధర్‌ బాబు విమర్శించారు. అధికారం లేదనే బాధ లో ఏదేదో మాట్లాడుతున్నారని, దేవుడు.. ప్రజలు మా వైపు ఉన్నారని, 100 రోజుల్లో మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌ బాబు ఉద్ఘాటించారు.