TTD EO Dharmareddy: శ్రీవాణి ట్రస్ట్ కి ఇప్పటి వరకు 880 కోట్లు విరాళాలు అందాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పారదర్శకంగానే శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు కేటాయించామన్నారు. 9 లక్షల మంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఆయన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో మాట్లాడుతూ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 ఆలయాల నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా విరాళాలు ఇచ్చిన భక్తులు ఒక్క ఫిర్యాదు కూడా చేయలేదని స్పష్టం చేశారు.
.శ్రీవాణి ట్రస్ట్ ఆలయ నిర్మాణాలు కొంత మంది కాంట్రాక్టర్లకు మాత్రమే ఇస్తున్నామని అసంబద్ధమైన ఆరోపణ చేశారని ధర్మారెడ్డి పేర్కొన్నారు.ఆలయ నిర్మాణాలు నాలుగు విధానాలలో నిర్వహిస్తున్నామన్నారు. ఒకటి దేవాదాయ శాఖ, రెండు టీటీడి, మూడు ఆలయ కమిటీలు, నాలుగు స్వచ్చంద సంస్థ ద్వారా మాత్రమే ఆలయ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. పార్వేటి మండపం శిధిలావస్థకు చేరుకోవడంతోనే జీర్ణోద్ధారణ చేస్తున్నామన్నారు.
Also Read: Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం
వేసవి కాలంలో నెలకొన్న రద్దీ నేపథ్యంలో రూ.300 రూపాయల దర్శన టికెట్ల కోటా తగ్గించామని, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తిరిగి రూ.300 దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల మధ్య ఎక్కువ తోపులాట లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తామని, మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ లైన్‌లో భక్తులను అనుమతిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.