NTV Telugu Site icon

Cyber Crime: వైద్యుడిని భయపెట్టి రూ.2 కోట్లను దోచుకున్న సైబర్ నేరగాళ్లు

Cyber Crime

Cyber Crime

Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్​ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబరాసురులు. తాజాగా రాయచోటిలో ఓ ప్రైవేట్ డాక్టర్ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో ఇరుక్కున్నాడు.

గత కొంత కాలంగా డాక్టర్‌ను ఆన్‌లైన్‌ ద్వారా బెదిరించి రూ.2 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. రాయచోటి పట్టణంలోని బ్రాహ్మణ వీధికి చెందిన ఓ ప్రైవేట్ చిన్నపిల్లల డాక్టర్‌కు ఫోన్ ద్వారా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ సైబర్ నేరగాళ్లు బెదిరించారు. “నీకు డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయి.. నీ హాస్పిటల్‌లో డ్రగ్స్ వాడుతున్నావ్.. నిన్ను, నీ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయబోతున్నాం… మా దగ్గర అరెస్టు వారెంట్ ఉంది” అంటూ పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్ చేసి డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు బెదిరించారు. కేసు నుంచి నిన్ను తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Read Also: Deputy CM Pawan Kalyan: బాలికపై అఘాయిత్యం అమానుషం..

ఈ క్రమంలోనే ఆ డాక్టర్‌.. విడతలవారీగా రెండు కోట్ల రూపాయలను 6 బ్యాంక్ ఖాతా నెంబర్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆఖరికి తాను మోసపోయానని గ్రహించి బాధిత ప్రైవేట్ డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు పేట్రేగిపోతున్నారు. డాక్టర్లను లక్ష్యంగా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో డాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు.