Divyang Shakti Scheme: నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం!

  • ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకం ప్రారంభం
  • నేడు ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
  • ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించనున్న సీఎం
Divyang Shakti Scheme Ap

Divyang Shakti Scheme Ap

Divyang Shakti Scheme AP: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది. దివ్యాంగుల సంక్షేమానికి కీలకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఇవాళ ఉదయం 11.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పాల్గొంటారని పాల్గొననున్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు మరింత సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

దివ్యాంగ శక్తి పథకం కింద ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంతటా దివ్యాంగులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ముఖ్యంగా 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుంది. ఇప్పటికే అమలులో ఉన్న 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే కాకుండా.. ఇప్పుడు 21 వర్గాల దివ్యాంగులకు ఈ పథకాన్ని విస్తరించడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు.

Also Read: IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.207 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. మొత్తానికి ‘దివ్యాంగ శక్తి’ పథకం దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ప్రారంభోత్సవం కోసం సీఎం చంద్రబాబు ఉదయం 11.15 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి.. రోడ్డు మార్గం ద్వారా 11.30కు మంగళగిరి ఆర్టీసీ బస్‌స్టాండ్‌కు చేరుకుంటారు. 11.35కు పథకాన్ని ప్రారంభించి.. దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తారు.