Site icon NTV Telugu

Divyang Shakti Scheme: ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం, డిప్యూటీ సీఎం!

Divyang Shakti Scheme

Divyang Shakti Scheme

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు రవాణా భారం తగ్గించేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్‌లో ఈ పథకాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ సహా ఇతర ప్రముఖులు దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. మంగళగిరి బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర డాన్‌బాస్కో స్కూల్‌ మీదుగా డోలాస్‌ నగర్‌, ప్రకాశ్‌నగర్‌, నులకపేట, ఉండవల్లి సెంటర్‌ మీదుగా పెనుమాక వరకు కొనసాగింది. బస్సు ప్రయాణంలో ముఖ్యమంత్రి దివ్యాంగులతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అందుతున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల బాగోగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, వారి సాధికారతకు తమ వంతు కృషి చేస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Also Read: Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభ కార్యక్రమానికి ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను చూసేందుకు జనం పోటీ పడటంతో మంగళగిరి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ చొరవపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దివ్యాంగులతో పాటు ప్రయాణించే సహాయకులకు కూడా ప్రభుత్వం ఊరట కల్పించింది. వారికి బస్సు చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తోంది. ఈ పథకం ద్వారా మొత్తం 12.76 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి సుమారు రూ.207 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

Exit mobile version