CM KCR: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు రైతుబంధు చెక్కులను సైతం అందించారు. పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నామని.. రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సీఎం తెలిపారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. సమాజం చైతన్యవంతం అవుతున్నా కొద్దీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నామన్నారు. మరోవైపు ఎన్నో ఏళ్ల ఆదివాసీల పోరాట ఆశయం నెరవేరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,51,000 మంది రైతులకు 4లక్షల 66 వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పోడు విషయంలో గిరిజన రైతులు కాకుండా గిరిజనులు కానివారు కూడా ఉన్నారన్నారు. అయితే, 75 ఏళ్లుగా వారు ఒక చోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అందుకోసం ఒక ప్రక్రియను తీసుకొస్తామని.. త్వరలోనే పనులు పూర్తి చేసి వారికి కూడా న్యాయం చేస్తామన్నారు కేసీఆర్.
మరోవైపు పోడు రైతుల పై కేసులు ఉపసంహరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గతంలో అడవులను ఆక్రమించారని కొంతమంది గిరిజనుల మీద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వమే ఈరోజు వారికి పట్టాలిచ్చి.. రైతు బంధును మంజూరు చేసింది. వారిమీద నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియపై సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ రైతుల పొలాల వరకు త్రీ ఫేజ్ కరెంట్ అందేలా చేస్తామని.. అంతేకాకుండా ‘గిరివికాసం’ కింద బోర్లు వేయిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంతకుముందు పర్యటనలో భాగంగా ఆసిఫాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.