NTV Telugu Site icon

TV Channels: రిషబ్ పంత్ యాక్సిడెంట్ కవరేజీ ఎఫెక్ట్.. ప్రైవేట్ టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

Tv Channels

Tv Channels

TV Channels: క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం, కొన్ని ఇతర క్రైమ్ స్టోరీలకు సంబంధించిన టెలివిజన్ వార్తల కవరేజీపై కేంద్ర సమాచార శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలు, నేరాలకు సంబంధించిన ఘటనల్లో కొన్ని మీడియా ఛానళ్లు భయంగొలిపే వీడియోలు, ఫొటోలను ప్రసారం చేయొద్దని హెచ్చరించింది. అన్ని ప్రైవేట్ శాటిలైట్ ఛానెళ్లకు ఇచ్చిన సలహాలో.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ క్రికెటర్ కారు ప్రమాదం, మృతదేహాల బాధాకరమైన చిత్రాలను ప్రసారం చేయడం, ఐదేళ్ల బాలుడిని కొట్టడం వంటి కవరేజీని ఉదహరించింది. అలాంటి రిపోర్టింగ్ బాధాకరమని పేర్కొంది.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్-1995” “ప్రోగ్రాం కోడ్” అమలు చేయాలని ఛానెళ్లకు ప్రభుత్వం సూచించింది. “ప్రోగ్రాం కోడ్” మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రైవేట్ ఛానెళ్లలకు సూచించింది. గత కొన్ని నెలలుగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు, చిన్నారులపై జరిగే హింస, వృద్ధులు, మహిళలపై జరిగే నేరాల ఘటనల ప్రసారాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మృతదేహాల దృశ్యాలు, గాయపడిన దృశ్యాలను యధాతథంగా ప్రసారం చేయడం పట్ల అభ్యంతరం తెలిపింది. ఇలాంటి ప్రసారాల కారణంగా చిన్నారులపై దుష్ప్రభావం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. టెలివిజన్ ఛానెళ్లు తమ వ్యవస్థలను సర్దుబాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ గట్టిగా మందలించింది.

Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం

చాలా కేసుల్లో సోషల్‌మీడియా నుంచి నేరుగా వీడియోలను తీసుకుని ఎలాంటి ఎడిటింగ్‌, బ్లరింగ్‌ చేయకుండానే తమ మాధ్యమాల్లో ప్రసారం చేస్తున్నారు. నేరాలకు ఇలా రిపోర్ట్‌ చేయడం హృదయ విదారకమే గాక, ప్రోగ్రామ్‌ కోడ్‌ నిబంధనలకు విరుద్ధమని, ఈ ఫుటేజ్‌లతో బాధితుల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం కలుగుతుందని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇటీవల రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం ఘటనలో క్రికెటర్‌ పంత్ రక్తపు గాయాలతో ఉన్న ఫోటోలను చూపించారు. దీంతో పాటు పంజాబీ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్యకు గురైనప్పుడు కూడా అలాగే ప్రసారమయ్యాయి.