Andhra Pradesh: ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది. మొత్తం 6 నామినేటెడ్ పదవులు బీజేపీ ఆశిస్తున్నట్టు సమాచారం. దుర్గగుడి చైర్మన్ సహా ప్రధాన పదవులు బీజేపీ కోరినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నామినేటెడ్ పదవులపై నిర్ణయించే అవకాశం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న వ్యక్తుల పట్ల కూటమి విముఖంగా ఉన్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. అంతకు ముందు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ.. వైసీపీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఫలితాలను అనుమానించడం ప్రజలను అవమానించడమేనన్నారు. ఏపీలో సెప్టెంబరు నుంచి జరిగే సభ్యత్వ నమోదుపై నేడు బీజేపీ సమావేశంలో చర్చ జరిగిందన్నారు. సీఎం చంద్రబాబును శివప్రకాష్ జీ, తాను కలిశామన్నారు. కూటమి బలపడటం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చిందన్నారు. మూడు పార్టీలు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చ జరిగిందన్నారు. చురుకుగా పాల్గొనాలని, సభ్యులను చేర్చాలని సూచించారని తెలిపారు. ఆరు సంవత్సరాలకు ఒకసారి సంపూర్ణ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదుకు ఒక టార్గెట్ అంటూ ఏమి లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.