Director SS Rajamouli Birthday today: అదృష్టవంతునికి అన్నీ కలసి వస్తాయంటారు; అలాగే అసాధ్యులు అనుకున్నది సాధించి తీరతారనీ చెబుతారు. అదృష్టం కలిసొచ్చిన అసాధ్యుడు దర్శకుడు రాజమౌళి. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా నీరస పడిన ప్రతీసారి ‘మాస్ సినిమాలు తీసుకొనే మనకూ అవార్డులు వస్తాయా?’ అంటూ మనవాళ్ళే గేలి చేసేవారు. అలాంటి వారికి మాస్ సినిమాలతోనూ బెస్ట్ మూవీస్ తెరకెక్కించవచ్చునని నిరూపించిన ఘనుడు రాజమౌళి. జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎప్పుడూ వెలుగుని తెలుగు సినిమాకు తన ‘బాహుబలి-1’తో ఆ అపూర్వ గౌరవం సంపాదించి పెట్టారు రాజమౌళి. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలకు ముందు, ఆ తరువాత రాజమౌళి సినిమా కెరీర్ ను విభజించ వచ్చు. అంతకు ముందు చిత్రాలలో ఫక్తు ఫార్ములాయే తకధిమితై అంటూ నాట్యం చేసింది. ‘బాహుబలి’ సిరీస్ తో టెక్నాలజీతోనూ ఇంటర్నేషనల్ ఆడియెన్సెస్ ను ఆకర్షించగలనని రుజువు చేసుకున్నారు. అప్పటి నుంచీ రాజమౌళి, ఆయన సినిమాలపై ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువారు ఆసక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం తన ‘ట్రిపుల్ ఆర్’తోనూ రాజమౌళి సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తున్నారు. ‘బాహుబలి’ సిరీస్ తరువాత రాజమౌళి తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’పై ఆరంభం నుంచీ అందరిలోనూ ఆసక్తి నెలకొనడానికి, అది రాజమౌళి సినిమా కావడం మొదటి కారణం. ఒకే తరానికి చెందిన యన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరూ మాస్ హీరోలు కలసి నటించడం రెండో కారణం. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని జనం ఎదురు చూసిన వైనం ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ కనిపించలేదు. ‘ట్రిపుల్ ఆర్’ జనం ముందు నిలిచాక చాలామంది పెదవి విరిచారు. ‘బాహుబలి’ సిరీస్ స్థాయిలో లేదన్నారు. అయినా జనం ఆ సినిమాను పదే పదే చూసి విజయపథంలో పయనించేలా చేశారు. అయితే ‘బాహుబలి-2’ స్థాయి విజయం మాత్రం ‘ట్రిపుల్ ఆర్’కు దక్కలేదు అన్నది నిర్వివాదాంశం! అయినప్పటికీ ‘ట్రిపుల్ ఆర్’ ఇప్పటికీ వార్తల్లో నానుతూ ఉండడమే రాజమౌళి మ్యాజిక్ అని చెప్పాలి.
ఆ సినిమాకు ఆస్కార్ బరిలో దూకే అవకాశాలు ఉన్నాయని ప్రఖ్యాత అమెరికన్ మేగజైన్ ‘వరైటీ’ పేర్కొనడంతో ‘ట్రిపుల్ ఆర్’ మళ్ళీ చర్చనీయాంశమయింది. మన దేశం నుండి ఆస్కార్ బరిలోకి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ’ కేటగిరీలో ఎంట్రీగా ఎంపికవుతుందనీ పలువురు ఆశించారు. అది జరగలేదు. కానీ, జనరల్ కేటగిరీలోనే ఆస్కార్ నామినేషన్స్ కోసం ‘ట్రిపుల్ ఆర్’ సిద్ధం కావడంతో మళ్ళీ రాజమౌళి వైపు సినీఫ్యాన్స్ చూపు సాగుతోంది. ఇలా మ్యాజిక్ చేస్తూ సాగుతోన్న రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’కు ఎన్ని ఆస్కార్ నామినేషన్స్ లభిస్తాయో కానీ, ప్రస్తుతం ఆయన పేరు సినీ ఫ్యాన్స్ కు ఓ మంత్రంలా మారింది. ఉత్తరం, దక్షిణం అన్న తేడా లేకుండా అన్ని సినిమా రంగాలు రాజమౌళి నామస్మరణ చేస్తున్నాయి. ఓ తెలుగు దర్శకుడు ఈ స్థాయి సక్సెస్ సాధించడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణమే!
Monster Trailer: మంచు లక్ష్మీ కూతురు కిడ్నాప్.. ?
తెలుగువారికి ‘ఉత్తమ చిత్రం’ విభాగంలో తొలి నేషనల్ అవార్డు సంపాదించి పెట్టిన రాజమౌళి, తెలుగు సినిమాతో ఆస్కార్ నామినేషన్ కూడా సంపాదిస్తే అది ఓ చరిత్రే అవుతుంది. ఆ దిశగా రాజమౌళి సాగాలని ఆశిద్దాం!