టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ మూవీ ఎట్టకేలకు మార్చి 25న వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అంతకంటే ముందు ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రెండు విడుదల తేదీలు ప్రకటిస్తూ సరికొత్త ట్రెండ్‌ను రాజమౌళి సృష్టించాడు. ఇప్పుడు ఇదే ఫార్ములాను పలు సినిమాలు ఫాలో అవుతున్నాయి.
వారం రోజుల కిందట ఆర్.ఆర్.ఆర్ మూవీకి రెండు విడుదల తేదీలను రాజమౌళి ప్రకటించాడు. మార్చి 18 లేదా ఏప్రిల్ 29న తమ సినిమాను విడుదల చేస్తామన్నాడు. దీంతో పలు పెద్ద సినిమాల నిర్మాతలు డిఫెన్స్‌లో పడ్డారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఏ తేదీన విడుదలవుతుందో తెలియక తికమక పడ్డారు. తీరా చూస్తే జక్కన్న ఆ రెండు తేదీలను కాదని మార్చి 25వ తేదీని ఆర్.ఆర్.ఆర్ రిలీజ్‌కు ఫిక్స్ చేశాడు. అయితే దీనికి కారణం లేకపోలేదు. మార్చి 18న కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ మూవీ విడుదలవుతోంది. పునీత్ మృతికి నివాళిగా ఈ మూవీ విడుదలైన వారం రోజుల వరకు ఇతర సినిమాలను విడుదల చేయకూడదని కన్నడ పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. దీంతో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ మూవీ మార్చి 25కి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.
అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫార్ములాను భీమ్లా నాయక్, గని, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఫాలో అయిపోయాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీని కుదిరితే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అటు వరుణ్ తేజ్ నటించిన గని సినిమా కూడా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 తేదీలపై కర్చీఫ్ వేసింది. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ గతంలో మార్చి 25న విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించగా.. ఇప్పుడు అదే తేదీన ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ అవుతుండటంతో తాము కుదిరితే మార్చి 25 లేదా ఏప్రిల్ 15న వస్తామని తాజాగా ప్రకటించారు.