దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సొంత బ్యానర్ లో సినిమాలనే కాదు టీవీ సీరియల్స్ కూడా తీసి తన సత్తాను చాటారు. ఇటీవల ఆయన ఓటీటీ కంటెంట్ అందించే పనిలోనూ పడ్డారు. అలా రూపుదిద్దుకున్నదే ‘ఎక్స్ పోజ్డ్’ వెబ్ సీరీస్. నిజానికి డైలీ ఎపిసోడ్స్ గా దీనిని రూపొందించాలని తొలుత భావించినా, ఎందుకో మనసు మార్చుకుని ఓటీటీలో వీక్లీ ఫైవ్ ఎపిసోడ్స్ చొప్పున స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధపడ్డారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రతి గురువారం ఐదేసి ఎపిసోడ్స్ చొప్పున ప్రసారం చేస్తున్నారు. మొదటి విడతగా అక్టోబర్ 6న వెలువడిన ఐదు ఎపిసోడ్స్ ను చూస్తే… కె. రాఘవేంద్రరావు టీమ్ ఈసారి మీడియాను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. టీఆర్పీ రేటింగ్ కోసం ఛానెల్స్ పడే పాట్ల నేపథ్యంలో గతంలో జాతీయ స్థాయిలో కొన్ని సీరియల్స్, వెబ్ సీరీస్ లు వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా మీడియాలో పనిచేసే వ్యక్తుల మధ్య ఉండే ఇగో క్లాషెస్, ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్స్ మీద ఇందులో ఎక్కువ ఫోకస్ పెట్టారు. అంతేకాదు… ఓ రివేంజ్ డ్రామానూ మిక్స్ చేశారు.
ఎక్స్ పోజ్డ్ అనేది 24 అవర్స్ న్యూస్ ఛానెల్. దాని ఫేస్ గ్రీష్మ (హర్షిత) అనే న్యూస్ ప్రెజెంటర్. అలానే ఆమె భర్త ఆకాశ్ (వాసుదేవరావు) కూడా అందులో న్యూస్ యాంకర్ గా చేస్తుంటాడు. వర్క్ లో పడి పర్సనల్ లైఫ్ ను చాలా శాక్రిఫైజ్ చేస్తున్నానేమో ననే భావన ఒకానొక సమయంలో గ్రీష్మకు కలుగుతుంది. దాంతో బర్త్ డే రోజున భర్తతో కలిసి వెకేషన్ కు దుబాయ్ వెళ్ళాలనుకుంటుంది. తానే ఫేస్ ఆఫ్ ది ఛానెల్ అయినా గ్రీష్మకు లోపల ఎక్కడో జాబ్ విషయంలో ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. తనలా షార్ట్ హెయిర్ తో ఏ యాంకర్ ఇంటర్వూకు వచ్చినా ఆమె తట్టుకోలేదు. ఛానెల్ సీఈవో మిత్ర, చీఫ్ ఎడిటర్ కిరణ్మయి (ఆర్జే కాజల్) కూడా గ్రీష్మ చెప్పిందే వింటారు. స్పోర్ట్ రిపోర్టర్ నిత్య తన బావ, క్రికెటర్ సంజయ్ తో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటే, క్రైమ్ రిపోర్టర్, ప్లే బాయ్ క్రిష్ ఛానెల్ లోని అందమైన అమ్మాయిలను ఫ్లట్ చేయాలని చూస్తాడు. ఇలాంటి ఛానెల్ లోకి తన పగను తీర్చుకోవడానికి ఓ పథకం ప్రకారం అడుగు పెడుతుంది వర్ష (శిరీష నూలు). మొదటి రోజే గ్రీష్మకు నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగించిన వర్ష… ఆమె దుబాయ్ ట్రిప్ ను ఎలా కాన్సిల్ చేసింది? అసలామె గ్రీష్మ మీద పగబట్టడానికి కారణం ఏమిటీ? అనే దానిని గురువారం ప్రసారం చేసిన తొలి ఐదు ఎపిసోడ్స్ లో చూపించారు.
మీడియాలోని వ్యక్తుల గ్రే షేడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడంతో ఇందులోని పాత్రలను ఓన్ చేసుకోవడం వ్యూవర్స్ కు కాస్తంత కష్టమే. దుబాయ్ లోని స్వి మ్మింగ్ పూల్ ల్ లో గ్రీష్మ బాడీ తేలుతుండగా, ఆమె వాయిస్ ఓవర్ లో జరిగిన కథను వివరించడం ఆసక్తికరంగా ఉంది. టీవీ స్క్రీన్ మీద అందంగా కనిపించే న్యూస్ ప్రెజెంటర్స్ జీవితాల్లోని చీకటి కోణాలను, వారి బలహీనతలను కాస్తంత అతిగానే ఇందులో చూపించారు. ప్రతి రంగంలో ఉన్నట్టుగానే మీడియాలోనూ కొంతమంది ఈ ప్రొఫెషన్ ను మిస్ యూజ్ చేస్తుండొచ్చు. కానీ ఇందులో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ ఇంతే అన్నట్టుగా చూపించడం సమంజసం కాదు.
గ్రీష్మగా హర్షిత అందంగా ఉండటమే కాకుండా చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. ఆకాశ్ పాత్రధారి వాసుదేవరావుకు నటన కొత్త కాదు. పాత్రోచితంగా నటించాడు. ఇక ఆర్జే కాజల్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ గా మెప్పించింది. నిజానికి ఇది గ్రీష్మ కథ అనే కంటే వర్ష కథ అనడం సబబు. ఆ పాత్రను శిరీషా పోషిస్తోంది. ఇప్పటి వరకూ ప్రసారమైన ఐదు ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. ఓటీటీ లో ప్రసారం అవుతోంది కాబట్టి క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో కాస్తంత ఎడ్వాంటేజ్ తీసుకున్నారు. అయినా ఫర్వాలేదు, పెద్దగా హద్దులు మీరలేదు. అనురాధ గౌతమ్ కశ్యప్ టీమ్ క్యారెక్టర్స్ కు తగ్గట్టుగా సంభాషణలు రాశారు. విజయ్ కృష్ణ దర్శకత్వ ప్రతిభ, సాయి మధుకర్ నేపథ్య సంగీతం, సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ, వెంకట్ ఎడిటింగ్ చక్కగా ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి అరగంటలోపే ఉండటంతో చకచకగా సాగిపోయినట్టు అనిపించింది. మరి రాబోయే రోజుల్లో ఈ వెబ్ సీరిస్ ను ఇంకెంత ఆసక్తికరంగా మలుస్తారో చూడాలి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో కలిసి రాఘవేంద్రరావు సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ మీడియా బ్యాక్ డ్రాప్ క్రైమ్ థిల్లర్ పై ఓ లుక్కేయొచ్చు!