Director G.Nageshwar Reddy Birthday: దర్శకుడు, కథకుడు జి.నాగేశ్వర రెడ్డిని చూడగానే బాగా తెలిసిన వాడిలా అనిపిస్తుంది. ఆయన సినిమాలు, వాటిలోని అంశాలు సైతం మన చుట్టూ జరిగినట్టే ఉంటాయి. అయితే వాటిలో ఆయన కితకితలు పెట్టే హాస్యాన్ని జోడించి, రంజింప చేసిన తీరు భలేగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి దాకా 17 చిత్రాలు రూపొందించిన నాగేశ్వర రెడ్డి ఈ యేడాది మంచు విష్ణు నటించిన ‘జిన్నా’కు కథ సమకూర్చారు. ‘బుజ్జీ… ఇలారా’ అనే చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. త్వరలో మరో వినోదాల విందును తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు నాగేశ్వర రెడ్డి.
రాయలసీమ ప్రాంతానికి చెందిన నాగేశ్వర రెడ్డికి చిన్నతనం నుంచీ సినిమాలపై ఆసక్తి మెండు. అదే ఆయనను సినిమా రంగంవైపు పరుగులు తీసేలా చేసింది. ప్రముఖ దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి వద్ద అసోసియేట్ గా “రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, ఘటోత్కచుడు, వజ్రం, మావిచిగురు” వంటి చిత్రాలకు పనిచేశారు. తరువాత సొంతకథను తయారు చేసుకొని దర్శకునిగా ప్రయత్నాలు మొదలెట్టారు నాగేశ్వరరెడ్డి. దర్శకునిగా ఆయన తొలి చిత్రం ‘6 టీన్స్’ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో రోహిత్ హీరోగా మంచి మార్కులు సంపాదించారు.
Unstoppable 2: ‘ఆహా’… నటరత్నను స్మరించుకున్న ఆ ఐదుగురు!
శ్రీకాంత్, ప్రభుదేవా, నమితతో నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణుల పెళ్ళి’ కూడా వినోదం పంచింది. అల్లరి నరేశ్ హీరోగా నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన “సీమ శాస్త్రి, సీమ టపాకాయ్” భలేగా అలరించాయి. దాంతో నాగేశ్వరరెడ్డి సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ అనే మాట సినీఫ్యాన్స్ లో బలపడింది. మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ గానూ పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి మాస్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి తన తనయుడు వైభవ్ ను హీరోగా నటింపచేస్తూ ‘కాస్కో’ అనే చిత్రాన్ని నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలోనే నిర్మించారు. మంచు విష్ణు హీరోగా నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన ‘దేనికైనా రెడీ’ సినిమా భలేగా మురిపించింది. మంచు మనోజ్ తో నాగేశ్వర రెడ్డి రూపొందించిన ‘కరెంట్ తీగ’ కూడా ఆకట్టుకుంది. ఇలా మంచు సోదరులకు విజయాలను అందించిన నాగేశ్వర రెడ్డి, మంచు విష్ణుతో “ఈడో రకం ఆడో రకం, ఆచారి అమెరికా యాత్ర” వంటి సినిమాలనూ రూపొందించారు. సందీప్ కిషన్ హీరోగా “తెనాలి రామకృష్ణ బి.ఏ, బియల్, గల్లీరౌడీ” చిత్రాలతోనూ అలరించారు. ‘ఈడో రకం ఆడో రకం-2’ కూడా నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది. తన చిత్రాలన్నిటా వినోదానికే పెద్ద పీట వేసిన నాగేశ్వర రెడ్డి మునుముందు కూడా అదే తీరున అలరిస్తారని ఆశిద్దాం.