Dies Irae: మలయాళంలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న మిస్టరీ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘డీయస్ ఈరే’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ విడుదల చేస్తోంది. మలయాళంలో అక్టోబర్ 31న విడుదలైన ‘డీయస్ ఈరే’ అక్కడ విజయాన్ని సాధించింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 7 (గురువారం) రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్లతో విడుదల కానుంది. నవంబర్ 8 (శుక్రవారం) నాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.
READ ALSO: Pawan Kalyan: తుఫాన్ నష్టం, అవనిగడ్డ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ సమీక్ష!
ఈ సందర్భంగా ‘డీయస్ ఈరే’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే… ఓ విలాసవంతమైన భవంతి, అందులో మహిళ హెయిర్ క్లిప్ పట్టుకుని కూర్చున్న వ్యక్తి కనిపిస్తారు. ఆ తర్వాత “ఆకాశం… భూమి… భూడిద అవ్వగా, లోకం కన్నీళ్ల భయంతో నిండుతుంది” అనే వింత గొంతు వినిపించి, ట్రైలర్ ముగుస్తుంది. కథాంశాన్ని రివీల్ చేయకుండానే, హారర్ మరియు థ్రిల్స్ ఎలిమెంట్స్‌ను పుష్కలంగా చూపించారు.
మలయాళంలో సూపర్ హిట్ టాక్
‘భూత కాలం’, ‘భ్రమ యుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో మంచి వసూళ్లతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ సంస్థలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. శ్రీ స్రవంతి మూవీస్ గతంలో కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’, ‘నాయకుడు’ నుంచి ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ వరకు పలు పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలు సాధించింది. ఆ కోవలోనే ‘డీయస్ ఈరే’ కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో సుష్మితా భట్, జిబిన్ గోపీనాథ్, జయ కురుప్, మనోహరి జాయ్, అరుణ్ అజికుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.
READ ALSO: India vs South Africa Test Squad 2025: దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ఇదే.. పాపం షమీ!