Dgp Ravi Gupta: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతంలో ఇటీవల పోలీసులకు నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని ఛత్తీస్ ఘడ్ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో తెలంగాణ డీజీపీ రవిగుప్తా పర్యటించారు.
READ MORE: Uttam Kumar Reddy: నల్లగొండ, భువనగిరిలో ఆ పార్టీలు డిపాజిట్ కోల్పోతాయ్..
ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతం చర్ల మండలంలోని చెన్నాపురం, పూసుకుప్ప, ఉంజుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న పోలీస్ బేస్ క్యాంపులను సందర్శించారు. హెలికాప్టర్ ద్వారా నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన ఆయన.. భద్రాచలం ఐటీసీ గెస్ట్ హౌస్ లో భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా భద్రాద్రి జిల్లాలో డీజీపీ రవి గుప్తా పర్యటన పూర్తయ్యే వరకు వివరాలను గోప్యంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.