ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా వలసలు జరుగుతున్నాయి. టికెట్ దక్కనివారు పక్క పార్టీల వైపు చుస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వసంతతో పాటు మైలవరానికి చెందిన చాలామంది టీడీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలో టీడీపీలోకి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రావడంతో.. అక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో ఉమాకు టికెట్ ఇవ్వొద్దని, తనకు టికెట్ ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున కార్యక్రమలు నిర్వహించిన బొమ్మసాని వెనక్కుతగ్గారు. వసంత రాకతో దేవినేని ఉమా, బొమ్మసాని కలిసిపోయారు.
Also Read: Greater Noida : మాల్‌లో భారీ ప్రమాదం.. భవనం గ్రిల్ కూలి ఇద్దరి మృతి
మైలవరంలో ఒకే వేదికపై ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు మాట్లాడారు. తాము పార్టీ కోసం కలిసి పనిచేస్తామంటూ శ్రేణులకు ఇరువురు నేతలు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం జేఎన్ఎన్‌యూఆర్‌ఎం కాలనీ నుండి ఎన్నికల శంఖారావం ఈ ఇద్దరు నేతలు మొదలుపెట్టనున్నారు. ఇద్దరు కలిసి యువగళం కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేవరకూ విశ్రమించేది లేదని దేవినేని ఉమ, బొమ్మసాని శ్రేణులతో అన్నారు.