ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్‌ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు.
‘నెహ్రూ గారి 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. నాకు అన్ని విధాలుగా అండగా నిలిచే మెరుగు నాగార్జున, కైలా అనిల్ కుమార్ ఈ జయంతి కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందంగా ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్‌ను నెహ్రూ ఎంతో ప్రేమించారు. నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్‌ఆర్ ఇచ్చారు. నాకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు. నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగింది. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేశాం. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే లాగ కృషి చేస్తాం. నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తాం’ అని దేవినేని అవినాష్ చెప్పారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం!
‘నెహ్రూ లాంటి నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరొకడు లేడు. దాదాపు ముప్ఫై సంవత్సరాల పాటు శాసన సభ్యులుగా ఉన్నారు. నెహ్రూ దగ్గరకు వెళ్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ప్రజలు నమ్ముతారు. అవినాష్‌ని వైఎస్ జగన్ ఎంతో ప్రేమిస్తారు. నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పని చేస్తాడు. అవినాష్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని కైలా అనిల్ కుమార్ చెప్పారు. మాజీమంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు దేవినేని నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.