Site icon NTV Telugu

Deputy CM Bhatti Vikramarka: క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి..

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Deputy CM Bhatti Vikramarka: ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి ప్రజాభవన్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణపై సెలబ్రేషన్ కమిటీ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న మొట్ట మొదటి పండుగ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగాలన్నారు. ప్రజల సంపద ప్రజలకు పంచడంలో భాగంగా పేద కుటుంబాలకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీ, విందును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Minister Seethakka: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత ఇలాకాకు సీతక్క

క్రిస్మస్‌ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్‌లు (దుస్తులు) పంపిణీ చేస్తోందని, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసి పరిధిలోని 200 ప్రాంతాల్లో 500 మందికి, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెయ్యి మందికి చొప్పున గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయడంతో పాటు విందు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రిస్మస్ వేడుకలు నిర్వహణ యాక్షన్ ప్లాన్ గురించి మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించారు. పేద క్రైస్తవులకు పంపిణీ చేసే గిఫ్ట్ ప్యాక్ దుస్తుల నాణ్యతను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలోఎంసీహెచ్ఆర్‌డీ అడిషనల్ డైరెక్టర్ బీఎం ఎక్కా, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సీపీ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version