Jharkhand Wedding: జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జరిగిన ఒక వివాహానికి ఉచిత భోజనం కోసం దొంగచాటుగా వచ్చిన కొంతమంది ఆహ్వానం లేని అతిథులు, వేడి పూరీలను వేయలేదని తిరస్కరించిన తర్వాత భారీ గందరగోళం సృష్టించారు. ఆ పెళ్లిలో వేడివేడి పూరీల కోసం రచ్చరచ్చ చేశారు. పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గొడవ ముగిసింది. మంగళవారం రాత్రి ముఫాసిల్ ఠాణా పరిధిలోని పాతరోడి ప్రాంతంలో శంకర్ యాదవ్ అనే వ్యక్తి నిర్వహించిన వివాహ వేడుకకు కొంత మంది యువకులు హాజరయ్యారు. ఆహారం విషయంలో వివాదం తలెత్తడంతో ఘర్షణ చెలరేగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Money Found On Tree: మామిడి చెట్టుపై నోట్ల కట్టలు.. కోటి రూపాయలను జప్తు చేసిన ఐటీ
పెళ్లిలో భోజనం పెట్టకపోవడంతో యువకులు కావాలనే గొడవకు దిగారని ఆరోపించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వేడి పూరీలు కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించిన యువకుల్లో ఒకరు ఈ గొడవను ప్రారంభించినట్లు సమాచారం.బయటి నుంచి మరికొందరు యువకులను పిలిచారు. వారు దుర్భాషలాడటం ప్రారంభించారు. పరిస్థితి త్వరితగతిన తీవ్రమైంది. రాళ్లు రువ్వడంతో పాటు కట్టెలతో పలువురిపై యువకులు దాడికి పాల్పడ్డారు. ఫలితంగా ముగ్గురు లేదా నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పెద్దఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పోలీసులు ఆందోళనకు దిగిన అతిథులను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మొత్తం వివాదానికి కారణమైన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పోకిరీ యువకులు కావాలనే గొడవను ప్రారంభించినట్లు వివాహ నిర్వాహకులు తెలిపారు.