Site icon NTV Telugu

K.Keshava Rao : డీలిమిటేషన్ అంశంపై కేకే కీలక వ్యాఖ్యలు

K Keshava Rao

K Keshava Rao

K.Keshava Rao : తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు.

కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్‌లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రతినిధిత్వం ఉండాలని కోరే ప్రక్రియ అని వివరించారు. ప్రతి జనాభా గణన తర్వాత ఇదే వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. ప్రధానంగా ఫెడరలిజం నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “మోడీ – అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారు. సెంట్రల్ లిస్ట్‌ను పెద్దది చేశారు, స్టేట్ లిస్ట్‌ను తగ్గించారు. ఫలితంగా, రాష్ట్రాల హక్కులు పోతున్నాయి” అని కేశవరావు వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్ అంశంపై బీజేపీ మౌనంగా ఉంటోందని, ఉత్తరాది రాష్ట్రాల్లో అస్సాం, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో సీట్ల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తూనే, దక్షిణాదిలో మాత్రం విస్మరించడం దారుణమని అన్నారు. తెలంగాణకు సీట్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. “సీట్లు పెంచండి అని అడగడం వల్ల రాష్ట్రాల హక్కులు దక్కుతాయి. కానీ అమిత్ షా తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదు. అలాంటి మైండ్‌సెట్‌తో సమస్యల పరిష్కారం కాదు” అని కేశవరావు విమర్శించారు.

కేశవరావు ఇందిరా గాంధీ హయాంలో కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయని గుర్తు చేశారు. అయితే, డీలిమిటేషన్ వ్యవహారంలో ప్రస్తుతం కథానాయకుడు స్టాలిన్ అయినా, హీరో మాత్రం రేవంత్ రెడ్డేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హైదరాబాద్‌లో బహిరంగ సభ పెడతామని ప్రకటించడం దక్షిణాది రాష్ట్రాల కోసం కీలక పరిణామం. ఇది రాబోయే రాజకీయ అజెండాను మలుపుతిప్పే అవకాశం ఉంది” అని కేశవరావు అభిప్రాయపడ్డారు.

Vivo Y19e:5500mAh బ్యాటరీ.. ప్రీమియం లుక్ తో వివో నుంచి చౌకైన ఫోన్..

Exit mobile version