Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది గాయపడ్డారు. హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న ఈ రెస్టారెంట్‌లో ఉదయం సుమారు 8.50 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9.45 గంటలకు అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలను ఘటనాస్థలికి తరలించింది.
మంటలు వేగంగా వ్యాపించడంతో రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయిన పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సాహసోపేతంగా 37 మందిని బేస్‌మెంట్ నుంచి రక్షించి, క్యాట్స్ అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించారు. అనంతరం గాయపడిన 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 10 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.
అగ్నిప్రమాదం అదుపులోకి వచ్చినప్పటికీ భవనంలో మరెవరైనా చిక్కుకుపోయి ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, పోలీసులు భవనాన్ని పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు. మంటలు ఎలా చెలరేగాయి? భవనంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
#WATCH | Delhi | Death toll rises to 10 in Malviya Nagar restaurant fire incident, say Delhi Police.
Visuals from the site pic.twitter.com/sfrzsMzJIm
— ANI (@ANI) June 3, 2026
