Delhi Enforces ‘No PUC, No Fuel’ Rule as Air Pollution Turns Severe: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్రంగా మారింది. దీని దృష్ట్యా, ఢిల్లీ ప్రభుత్వం, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. గురువారం నుంచి ఢిల్లీలో “నో పియుసి, నో ఫ్యూయల్” నియమం అమల్లోకి వస్తుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియుసి) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్‌జీ అందించరు. ఢిల్లీ కాకుండా ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రార్ అయిన BS-VI కంటే తక్కువ ఉద్గార ప్రమాణాలు కలిగిన వాహనాల ప్రవేశం రాజధానిలోకి పూర్తిగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు పర్యావరణ (రక్షణ) చట్టం, 1986లోని సెక్షన్ 5 కింద జారీ చేశారు. GRAP స్టేజ్ IV (తీవ్రమైన+) అమలులో ఉన్నంత వరకు అమలులో ఉంటుంది. శీతాకాలంలో ఢిల్లీలో గాలి చాలా విషపూరితంగా మారుతుందని, PM2.5, PM10 స్థాయిలు నిర్దేశించిన ప్రమాణాలను చాలా రెట్లు మించిపోతాయని ప్రభుత్వం చెబుతోంది.
READ MORE: GHMC Ward Delimitation: వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు.. అసలు ప్రాబ్లం ఏంటి?
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బీఎస్-IV ఉద్గార ప్రమాణాల కంటే తక్కువ ఉన్న పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు బుధవారం తన ఉత్తర్వులను సవరించింది. బీఎస్-III, పాత వాహనాలు కాలుష్య స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోవడానికి కోర్టు అనుమతి కోరింది. దీంతో కోర్టు సమ్మతించింది. ఇక వాహనదారులు ఢిల్లీలోని అన్ని పెట్రోల్, డీజిల్, CNG పంపుల్లో PUC సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే ఇంధనాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. PUC లేకుండా ఇంధనాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. భౌతిక ధృవపత్రాలు, ANPR (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, వాహన్ డేటాబేస్, వాయిస్ అలర్ట్ సిస్టమ్, పోలీసులను ఉపయోగించి PUC ధృవీకరణ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. నిర్మాణ కార్యకలాపాలు కాలుష్యానికి దోహదపడుతున్నందున, ఇసుక, కంకర, రాయి, ఇటుకలు, సిమెంట్, రెడీ-మిక్స్ కాంక్రీట్, శిథిలాలు వంటి నిర్మాణ సామగ్రిని మోసుకెళ్లే ఏ వాహనాన్ని కూడా ఢిల్లీలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వాహనాలను స్వాధీనం చేసుకోవడం, భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.