Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో సిసోడియా తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన విచారణకు సహకరిస్తున్నారని, కస్టోడియల్ విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో సిసోడియా కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు మంగళవారం విచారణ జరిపింది.
మనీష్ సిసోడియా ముడుపులు తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, సోదాల్లోనూ ఆయనకు వ్యతిరేకంగా ఏమీ లభించలేదని సిసోడియా తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఆయన విచారణకు పూర్తిగా సహకరిస్తు్‌న్నారని, విదేశాలకు పారిపోయే ముప్పు లేదని.. అందువల్ల ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదన్నారు. ఇక మనీష్ సిసోడియా భార్య అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన కుమారుడు విదేశాల్లో చదువుతున్నాడని.. ఈ నేపథ్యంలో భార్యను చూసుకోవాల్సిన బాధ్యత సిసోడియాపై ఉందని మనీష్ సిసోడియా తరఫు న్యాయవాది వాదించారు.
Read Also: Medvedev: ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి, క్షిపణి రావచ్చు.. ఐసీసీకి మెద్వెదేవ్ వార్నింగ్
బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు కేసులో సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారించిన తర్వాత మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఇదే వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఈడీ, జైలులో ఉన్న మనీష్ సిసోడియాను ఇటీవల తన కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 22 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలోనే మనీలాండరింగ్ కేసులోనూ బెయిల్ కోరుతూ ఆయన దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు.. సిసోదియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 25లోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో సిసోదియా ఏప్రిల్ 3 వరకు జైల్లోనే ఉండనున్నారు.