Site icon NTV Telugu

Rajnath Singh: నిందితులను కఠినంగా శిక్షిస్తాం.. బాధితులకు న్యాయం చేస్తాం: రాజ్‌నాథ్‌ సింగ్

Rajnath Singh

Rajnath Singh

ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ స్పందించారు. పేలుడు ఘటనపై భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ చేస్తున్నాయని, నిందితులను కఠినంగా శిక్షిస్తాం అని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్ హామీ ఇచ్చారు. ఈ చర్యను శాంతికి భంగం కలిగించే పిరికి ప్రయత్నంగా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు.

‘ఎర్రకోట కారు పేలుడు ఘటనపై దేశంలోని భద్రతా, దర్యాప్తు సంస్థలు సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాయి. దర్యాప్తు వివరాలు త్వరలోనే వెల్లడిస్తాము. నా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనూ పేలుడుకు బాధ్యులను వదిలిపెట్టం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది’ అని రాజ్‌నాథ్‌ సింగ్ చెప్పారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సహా పలు ఏజెన్సీలు దర్యాప్తులో భాగం కానున్నాయి. మరోవైపు పేలుడు ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను గుర్తించాం అని, ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని ప్రధాని చెప్పారు.

Also Read: Delhi Car Blast: ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి ఉమర్‌ మహ్మద్‌.. సహచరులతో కలిసి మాస్టర్ ప్లాన్!

ఢిల్లీ కారు పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరిగింది. సోమవారం సాయంత్రం జరిగిన పేలుడులో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు మంగళవారం ఢిల్లీ పోలీసులు తెలిపారు. గాయపడిన మరో 17 మందికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Exit mobile version