NTV Telugu Site icon

JD Chakravarthy: బ్రహ్మాజీ పాత్రలో న‌న్ను యాక్ట్ చేయమన్నారు.. రాజ‌శేఖ‌ర్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన జేడీ చక్రవర్తి!

Jd Chakravarthy

Jd Chakravarthy

JD Chakravarthy Reveals Facts about Krishna Vamsi: ‘జేడీ చక్రవర్తి’.. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సత్య, గులాబి, మనీ మనీ, మనీ, అనగనగా ఓ రాజు, బొంబాయి ప్రియుడు, దెయ్యం, ప్రేమకు వేళాయె, కోదండ రాముడు, పాపే నా ప్రాణం లాంటి ఎన్నో సినిమాలలో హీరోగా చేశారు. ఇక శివ, హిప్పీ, హోమం, సర్వం, శ్రీదేవి, ఎగిరే పావురం, ఐస్ క్రీమ్, దుబాయ్ శ్రీను, జోష్, డైనమైట్, కారి లాంటి సినిమాలలో కీలక పాత్రలు చేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న జేడీ చక్రవర్తి.. తాజాగా ‘ద‌యా’ వెబ్ సిరీస్‌లో నటించారు. డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ వెబ్-సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సందర్భంగా జేడీ గులాబి రోజులను గుర్తుచేసుకున్నాడు.

జేడీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేసింది దర్శకుడు కృష్ణవంశీ. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘గులాబి’ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత హీరోగా జేడీ ఎన్ని సినిమాలు చేసినా.. కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా చేయలేదు. సినిమా కాదు కదా.. కనీసం స్టేజ్‌ను కూడా షేర్ చేసుకోలేదు. 28ఏళ్ల త‌ర్వాత ఈ ఇద్దరు ద‌యా వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ సందర్భంగా కలుసుకున్నారు. ఈవెంట్‌కి కృష్ణవంశీ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సంద‌ర్భంగా జేడీ మాట్లాడుతూ గులాబి సినిమాకు ముందు జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు.

Also Read: ATM AC Robbery: ఏటీఎం మెషిన్‌, డబ్బు వదిలేసి.. ఏసీ ఎత్తుకెళ్లిపోయిన దుండగులు!

జేడీ చక్రవర్తి మాట్లాడుతూ… ‘నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కార‌ణం కృష్ణవంశీ గారే. ఎన్నో ఏళ్ల త‌ర్వాత ఇద్దరం ఓ స్టేజ్‌పై క‌లుసుకోవ‌టం ఆనందంగా ఉంది. ఓ విషయం చెప్పాలి.. కృష్ణవంశీ డైరెక్టర్ కావాలనుకున్నపుడు కథ చెప్పడానికి నేను త‌న‌ను తీసుకుని రాజ‌శేఖ‌ర్‌ గారి దగ్గరకు వెళ్లాను. గులాబి క‌థ చెబుతాడ‌నుకుంటే.. మ‌రో క‌థ చెబుతున్నారు. గులాబి క‌థ చెప్పమని నేను అనగానే.. రాజ‌శేఖ‌ర్‌ గారికి క‌థ చెప్పారు. ఆయనకు క‌థ బాగా న‌చ్చింది. గులాబిలో నేను చేసిన పాత్ర‌లో తాను న‌టిస్తాన‌ని.. బ్రహ్మాజీ పాత్రలో న‌న్ను యాక్ట్ చేయ‌మ‌ని రాజ‌శేఖ‌ర్‌ చెప్పారు. దాంతో కృష్ణవంశీ బ‌య‌ట‌కు వచ్చేశారు. గులాబి సినిమాను జేడీతోనే చేస్తానని చెప్పారు. నేనెప్పుడూ కృష్ణవంశీకి కృత‌జ్ఞత‌తోనే ఉంటా’ అని అన్నారు.

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వస్తున్న ద‌యా వెబ్ సిరీస్‌కి ప‌వ‌న్ సాధినేని దర్శకత్వం వ‌హించారు. ఇందులో జేడీతో పాటు ఈషా రెబ్బా, క‌మ‌ల్ కామ‌రాజు, విష్ణు ప్రియ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. ఆగ‌స్ట్ 4న డిస్నీ హాట్ స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. క్రైమ్ రాకెట్‌లో చిక్కుకున్న చెవిటి వ్యక్తిగా జెడి చక్రవర్తి ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

Also Read: Tomatoes Tulabharam: ఇదేందయ్యో ఇది.. టమాటాలతో తులాభారం! ఎక్కడో తెలుసా?