MK Meena: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచి రానున్న నూతన విధానాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమార్ ఇబ్రహీంపట్నం కమిషనరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. రాష్ట్ర స్దాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లా స్దాయిలో కూడా జిల్లా స్దాయి కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మీనా ఆదేశించారు.
Read Also: AP CM Chandrababu: తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదు
కలెక్టర్లు ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని. పట్టా భూముల నుంచి ఇసుక సేకరణకు త్వరలోనే జీవో ఇవ్వనున్నామని, రవాణా ఛార్జీలు మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ విధానంలో ఇసుక బుకింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికి వారు తమ ఇంటి నుంచే బుక్ చేసుకుని, జీపీఎస్ విదానంలో తమ వాహనం లోకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ విధానం పట్ల అవగాహన లేని గ్రామీణ ప్రాంతాల వారి కోసం సచివాలయంలో శిక్షణ పొందిన ఉద్యోగి అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఇసుక లభ్యత, ధరలపై నిత్యం మీడియాకు బులెటిన్ విడుదల చేయాలని మీనా అదేశించారు. జిల్లా స్థాయి వ్యవహారాలకు జాయింట్ కలెక్టర్‌ను బాధ్యునిగా చూస్తామన్నారు.
Read Also: AP CM Chandrababu: ప్రకృతి విపత్తులు పోవాలంటే చెట్లు నాటడమే ఏకైక మార్గం
గనుల శాఖ సంచాలకులు, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. త్వరలో అందుబాటులోకి రానున్న శాండ్ పోర్టల్ విభిన్న అంశాలకు మార్గనిర్దేశకత్వం వహిస్తుందన్నారు. సమస్త సమాచారాన్ని దానిలో అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా వాహనాల ఎంపానల్ మెంట్‌ను వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ఇసుక పరిస్థితిపై సమీక్ష చేస్తున్నారని, సీఎం అకాంక్షల మేరకు పనిచేయవలసి ఉందన్నారు. వంద శాతం వినియోగదారులు ఇసుక రవాణా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేయటమే ధ్యేయంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యవస్థలకు భిన్నంగా థర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్సరెన్స్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు, ఏడీలు పాల్గొన్నారు.