AP CM Chandrababu: వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు. ముంబై నటి వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందన్నారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.
Read Also: AP Rains: ఏపీలో అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం పేర్కొన్నారు. గుడ్లవల్లేరు కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం చేసిన తనిఖీల్లో ఎలాంటి పరికరాలు లభించలేదని తెలిపారు. అయినా దర్యాప్తు ఆపమని, సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలన్నారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.