జపాన్‌కు చెందిన ఎయిర్ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ తయారీ దిగ్గజం ‘డైకిన్’ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో కంప్రెసర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. తైవాన్‌కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. డైకిన్ ఇండియా, రెచి ప్రెసిషన్ కలిసి ఇన్వర్టర్, నాన్ ఇన్వర్టర్ ఏసీలలో వినియోగించే రోటరీ కంప్రెసర్లను తయారుచేసి.. విదేశాలకు ఎగుమతి చేయనుంది. ఈ ప్రాజెక్టులో డైకిన్ మెజారిటీ భాగస్వామిగా ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
‘ఈ ప్రాజెక్టులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడుల ప్రతిపాదన ఫైనల్ అవుతుంది. శ్రీసిటీలో ఏర్పాటు చేయబోయే యూనిట్‌తో కలిపి.. భారతదేశంలో మూడు తయారీ యూనిట్లు ఉన్నాయి. 75 ఎకరాల్లో ఏర్పాటు చేసే కర్మాగారం ఆగ్నేయాసియాలోనే అతి పెద్దది కానుంది. ప్రస్తుతం 2 మిలియన్ ఉత్పత్తి యూనిట్లను తయారు చేస్తున్నాం. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు చేర్చుతాం. మార్కెట్‌లో ఏసీ విక్రయాల్లో మెజారిటీ వాటా దక్కించుకోవాలన్నదే మా లక్ష్యం. దేశీయంగా మధ్య తరగతి ప్రజలకు చౌక ధరకే ఏసీలను అందిస్తాం’ అని డైకిన్ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్‌వీఏసీ (హీటింగ్, వెంటిలేషన్, ఏసీ, రిఫ్రిజిరేషన్) విభాగంలో రోటరీ కంప్రెసర్లు, మోటార్ల తయారీలో రెచీ ప్రెసిషన్‌కు మంచి పేరున్న విషయం తెలిసిందే.