Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ముంచుకొస్తోంది. దక్షిణ కోస్తాను ముంచెత్తబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిచౌంగ్ తీవ్ర తుఫాన్ వేగం తగ్గింది. ఇది చాలా ప్రమాదకరమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. తీవ్ర తుఫాన్… ప్రస్తుతం గంటకు 10కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీవ్ర తుఫాన్ నెమ్మదిగా పయనిస్తే… నష్టం తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రెండు రోజులు చాలా కీలకమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
రేపు ఉదయం బాపట్ల-దివిసీమ మధ్య తీవ్ర తుఫాన్ తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా తీవ్ర తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని చోట్ల కుంభవృష్టి వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ నంబర్ 10 జారీ చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కచ్చా ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని… విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మిచౌంగ్ తుఫాన్ నెల్లూరు జిల్లాను అతలాకుతలం చేస్తోంది. నెల్లూరు-బాపట్ల జిల్లాల మధ్య తుఫాన్ తీరం దాటుతుండటంతో జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు నెల్లూరు జిల్లాలోని పోదలకూరు, రాపూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని చెట్లను తొలగిస్తున్నారు.
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోయాయి. ఐదు జలాశయాలు నిండుకుండలా మారింది. దీంతో ఇవాళ రాత్రికి గోగర్భం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. తిరుపతి జిల్లాలోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది వరద ఉధృతితో ఉప్పొంగుతోంది. నది ప్రవాహాన్ని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేయడంతో పాటు స్వర్ణముఖి కరకట్టపైకి ఎవరినీ వెళ్లకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చటూరులోని ఆరినియార్ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పైభాగంలో చెరువులు, వాగులు వంకలు నిండుతుండటంతో… ముందస్తు చర్యగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్ట్ సామర్థ్యం 31 అడుగులు అయితే…. ప్రస్తుతానికి 28 అడుగులకు పైబడి నీటి నిల్వ ఉండేలా చూస్తున్నారు అధికారులు.