NTV Telugu Site icon

PROTECT: సైబర్‌ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ ప్రారంభం

Protect

Protect

PROTECT: సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్‌ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్‌లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ పని చేయనుంది.

2016 నుండి సైబర్ నేరాలను చూస్తున్నామని.. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయని సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. నేరం జరిగిన తర్వాత నేరస్థులను పట్టుకోవడం కంటే అసలు నేరం జరగకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. సైబర్ నేరాలను అరికట్టే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టూడెంట్స్, వాలంటీర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. సైబర్ క్రైమ్ గురించి అందరం కలిసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని వారికి సీపీ సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ముందుకు వచ్చిన వారికి సీపీ కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: Deputy CM Bhatti Vikramarka: తప్పు చేశారా లేదా అని చెప్పాల్సింది కేటీఆర్ కాదు..

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది దాదాపు 700 కోట్లు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి బాధితులు నగదు పోగొట్టుకున్నారని.. మనకు తెలియకుండానే సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. మన ప్రమేయం లేకుండానే బ్యాంక్‌లో మన డబ్బు మాయం అవుతుందని.. సాధారణ నేరాల కంటే సైబర్ నేరాలు డేంజర్ అంటూ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడుతున్నారని.. 1930 కి కాల్ చేస్తే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా పోలీసులు కాపాడతారన్నారు. సైబర్ నేరాలను అరికట్టడానికి టోల్ ఫ్రీ 1930 ఉందని ప్రజలకు తెలియజేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా సైబర్ క్రైమ్స్‌పై ప్రజలకు అవగాహన తీసుకురావాలన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ పేరుతో త్వరలో మంచి రీసల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు.