Cyber Fraud: సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎంతోమంది మోసపోతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. కొత్త పంథాలో సైబర్ నేరానికి పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా ఒక కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటర్నేషన్ లెవల్లో ట్రాన్జాక్షన్స్ జరిపే కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. కంపెనీల అకౌంట్ టేకోవర్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ–మెయిల్ ఖాతాలను హ్యాక్ చేయడం, చెల్లించే వరకు చూసి బ్యాంక్ ‘ఖాతా’ మార్చేయడం ద్వారా తేలిగ్గా సొమ్మును స్వాహా చేస్తున్నారు. ఈ నేరగాళ్ల బారినపడి హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ 1.39 లక్షల డాలర్లు (రూ.1.15 కోట్లు) పొగొట్టకుంది. తిరిగి అతికష్టం మీద పొందింది. హెచ్‌బీఎల్ సంస్థ బ్యాటరీలు, పలు రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తుంది. వాటి తయారీకి అవసరమయ్యే విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సింగపూర్‌కు చెందిన ఎక్సెల్ పాయింట్ అనే సంస్థ నుంచి విడిభాగాల కోసం సంప్రదించింది. ఎక్సెల్ పాయింట్‌కు మన దేశంలో కూడా కార్యాలయాలున్నాయి.
Read Also: Crime News: బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం
నవ్య అనే ఉద్యోగి.. హెచ్‌బీఎల్ సంస్థతో ఫోన్లో తన పేరిట ఉన్న ఈ మెయిల్ ఐడీ ద్వారా సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఎక్సెల్ సంస్థ విడిభాగాలకు సంబంధించి 1.39 లక్షల డాలర్లను.. ఈనెల 2న సింగపూర్ బ్యాంక్‌లోని తమ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ హెచ్‌బీఎల్‌కు మెయిల్ చేసింది. అదేరోజున సాయంత్రం 4:30 గంటలకు ఎక్సెల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా హెచ్‌బీఎల్ సంస్థకు మరో మెయిల్ వచ్చి. ఐటీ కారణాల వల్ల బ్యాంకు ఖాతాను మార్చాలని, యూఏఈకి చెందిన ఓ బ్యాంకు ఖాతాకు నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలని అందులో ఉంది. దీంతో హెచ్‌బీఎల్ సంస్థ అదేరోజున 1.39 లక్షల డాలర్లను యూఏఈ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసింది. కానీ రెండు రోజులైనా సింగపూర్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హెచ్‌బీఎల్ సంస్థ ప్రతినిధులు.. రెండోసారి వచ్చిన ఈ మెయిల్ నకిలీదని, సొమ్ము వేరే ఎవరికో ట్రాన్స్‌ఫర్ అయిందని గుర్తించారు. దీనిపై వెంటనే సంస్థ ఖాతా ఉన్న ఎస్‌బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్‌బీఐ సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం యూఏఈ బ్యాంకు నుంచి నగదును వెనక్కి రప్పించగలిగింది. క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులు ఎక్సెల్ సంస్థ వాడిన ఈ–మెయిల్ ఐడీని గుర్తించి, కేవలం ఒక్క అక్షరం మార్చి మరో ఈమెయిల్ ఐడీని సృష్టించారని.. దీనిని గమనించలేక పోవడంతో డబ్బు వేరేవారికి ట్రాన్స్‌ఫర్ అయిందని వివరిస్తున్నారు.