Petrol Diesel Prices: మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు కొంత కుదుటపడ్డాయి. శాంతి నెలకొంటుందనే ఆశల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయికి చమురు ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ 3.37% క్షీణించి బ్యారెల్‌కు 87.33 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 3.23% తగ్గి 84.88 డాలర్ల వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే, పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో మాత్రం పెట్రోల్ లీటరుకు 4 రూపాయలు, డీజిల్ 2 రూపాయలు చొప్పున తగ్గాయి.
వరుసగా ఐదో వారం తగ్గింపు
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ యుద్ధం తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతి వారం శుక్రవారం రాత్రి పెట్రోలియం ధరలను సవరిస్తోంది. ఈ క్రమంలో వరుసగా ఐదో వారం అక్కడ ధరలను తగ్గించారు. గత నెల రోజుల్లోనే పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర రూ. 41, డీజిల్ ధర రూ. 36 మేర తగ్గాయి. ఈ తాజా తగ్గింపు తర్వాత అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 373.78 (పాక్ కరెన్సీలో) కాగా, డీజిల్ ధర రూ. 378.78 గా ఉంది. మరోవైపు భారతదేశంలో మే 25 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు రాలేదు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్.. ఎక్కడ ధర తక్కువ?
పాకిస్థాన్‌లో ధరలు తగ్గినప్పటికీ, భారత కరెన్సీతో పోల్చి చూస్తే అక్కడ ఇప్పటికీ ఇంధన ధరలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఒక భారత రూపాయి విలువ దాదాపు 2.93 పాకిస్థాన్ రూపాయలతో సమానంగా ఉంది. ఈ లెక్కన చూస్తే.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర (భారత కరెన్సీలో) లీటరుకు రూ. 127.71 కాగా.. డీజిల్ ధర (భారత కరెన్సీలో) లీటరుకు రూ. 129.42గా ఉంది. అదే సమయంలో భారతదేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12 కాగా, డీజిల్ ధర రూ. 95.20 గా ఉంది. అంటే పాకిస్థాన్‌తో పోలిస్తే భారతదేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.

