వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఓ భార్య వేసిన స్కెచ్‌కు భర్త ఊపిరి ఆగిపోయింది. ప్రియుడితో కలిసి చంపేసి.. అనంతరం ‘భర్త పడుకుని ఇంకా లేవడం లేదని’ డ్రామా ఆడింది కిలాడి. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు.
నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారానికి చెందిన జల్లెల శేఖర్.. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టితో 2009లో వివాహం జరిగింది. వారికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం వారు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ప్రాంతం కోదండరామనగర్‌కు వలస వచ్చి ఉంటున్నారు. శేఖర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిట్టి స్థానికంగా ఉన్న ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తోంది. వారి కుమార్తె ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటోంది. కుమారుడు తల్లిదండ్రుల వద్దే ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుతున్నాడు.
కొన్నాళ్లకు చిట్టికి స్థానికంగా ఉండే హరీశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇంకేముంది సాఫీగా సాగిపోతున్న వారి సంసారంలో వివాహేతర బంధం చిచ్చు పెట్టింది. నగలు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో భార్య ప్రవర్తనపై భర్త శేఖర్‌కు అనుమానం వ్చచింది. దీంతో ఈ వస్తువులు ఎక్కడివి.. ఏం చేస్తున్నావ్ అంటూ చిట్టిని భర్త ప్రశ్నించాడు. ఈ క్రమంలో వారి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని భార్య భావించింది. ప్రియుడు హరీశ్‌తో కలిసి అందుకు ప్రణాళిక వేసింది.
తమ ప్లాన్ అమలు చేసేందుకు.. కుమారున్ని వినాయక మండపంలో స్నేహితులతో కలిసి పడుకోవాలని సూచించింది. తర్వాత అర్ధరాత్రి ప్రియుడు హరీష్‌ను పిలిపించింది చిట్టి. హరీష్ రాగానే ఇద్దరూ కలిసి శేఖర్‌ను నిద్రలోనే గొంతు నులిమి చంపేశారు. కానీ చనిపోయాడో లేదోనన్న ఉద్దేశ్యంతో డంబెల్‌తో తలపై మోదింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు హరీష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. శేఖర్‌ను చంపిన తర్వాత మధ్యాహ్నం వరకు ఇంట్లో మామూలుగానే గడిపింది చిట్టి. ఇంట్లో ఉన్న కొడుకుకి టిఫిన్ చేయించి బయటికి పంపించింది. మధ్యాహ్నం వచ్చిన తర్వాత నాన్న ఇంకా నిద్ర లేవలేదా? అని కొడుకు అడగగా.. అప్పుడు శేఖర్ చనిపోయాడన్న విషయాన్ని కొడుకుకు చెప్పింది. అదే సమయంలో పక్కనే ఉన్న మహిళ వచ్చి చూసేసరికి అప్పటికే శేఖర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని వెంటనే కేకలు వేసి అందరిని పిలిచింది.
స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో చిట్టిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడు హరీశ్‌తో కలిసి భర్త శేఖర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ఆమె ప్రియుడు హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిజానికి రెండేళ్ల క్రితమే హరీష్‌కు చిట్టికి మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై శేఖర్‌కు తెలియడంతో స్వగ్రామమైన నాగర్ కర్నూల్‌లో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అదే సమయంలో చిట్టి నాగర్ కర్నూల్లోని తమ ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో అందరూ కలిసి శేఖర్‌ని తిట్టి భార్యను సరిగ్గా చూసుకోవాలంటూ బుద్ధి చెప్పి పంపించారు. ఇక చిట్టికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇష్టానుసారంగా హరీష్‌ను శేఖర్ లేనప్పుడు ఇంటికి పిలిపించడం, వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. గత కొద్ది రోజులుగా ఈ విషయంపై భార్యాభర్త మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ సమయంలో శేఖర్ తమకు అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలని భావించిన చిట్టి హరీష్ అతన్ని హత్య చేశారు.
హరీష్ అనే వ్యక్తి తన తండ్రి స్నేహితుడని, తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడని, ఈ విషయంపై అమ్మానాన్నల మధ్య గొడవలు జరుగుతుండేవని శేఖర్ కూతురు చెబుతోంది. మరోవైపు తండ్రి చనిపోవడం, తల్లి పోలీస్ స్టేషన్లో ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పోలీస్ స్టేషన్ బయట ఇద్దరు పిల్లలు బంధువుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
