తేరగా డబ్బులు సంపాదించే వారు ఓ వైపు.. దురాశతో సంపాదిద్దామనుకునే వారు మరోవైపు.. వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్ కంటే గట్టిగానే ఏర్పడుతుంది. కానీ చివరకు అందులో నుంచి మోసం వెలుగులోకి వస్తుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో సరిగ్గా ఇలాగే జరిగింది. బంగారు నాణేల పేరుతో ఓ వ్యాపారిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. 20 లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.
చివ్వెంల మండలం తుమ్మలపెంపహాడ్కు చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యం, పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి ఓ ముఠాగా ఏర్పడ్డారు. అదే గ్రామానికి చెందిన నిమ్మనగోటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని టార్గెట్ చేశారు. అతను ఆర్ధికంగా స్థితిమంతుడు కావడం.. పైగా అతనికి డబ్బుపై మక్కువ ఉండడంతో అతన్ని టార్గెట్గా ఎంచుకున్నారు. ఇంకేముంది తాము అనుకున్న పనిపై ప్రొసీడ్ అయ్యారు.
తమకు పురాతన కాలం నాటి కుండలో బంగారు నాణేలు దొరికాయని.. ఓ కట్టు కథ సృష్టించారు. వాటిని తక్కువ ధరకే అమ్ముతామని నమ్మబలికారు. అప్పటికే హోటల్ వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు.. వారు ఊహించిన విధంగానే తక్కువ ధరకే బంగారం వస్తుండడంతో ఆశపడ్డాడు. దీంతో రూ. 20 లక్షలు ఇచ్చి బంగారు నాణేలు కొనుగోలు చేసేలా అతనితో డీల్ కుదుర్చుకున్నారు కేటుగాళ్లు. ఇందుకోసం రూ.5 లక్షలు అడ్వాన్స్ చెల్లించాడు వెంకటేశ్వర్లు. ఆగస్టు 11న మిగతా సొమ్ము 15 లక్షలు ఇచ్చేశాడు. దీంతో మొత్తం 20 లక్షల రూపాయల చెల్లింపు పూర్తయింది.
అంతా బాగానే ఉంది. ఇక బంగారు నాణేల కోసం ఎదురు చూస్తున్నాడు వెంకటేశ్వర్లు. కానీ తనకు గోల్డ్ కాయిన్స్ ఇస్తామన్న ముఠా జాడ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లుకు అనుమానం స్టార్ట్ అయింది. గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలని వారికి కాల్ చేశాడు. కానీ ఈసారి మరో స్కెచ్చేశారు కేటుగాళ్లు. తమపై దోపిడీ దొంగలు దాడి చేశారని.. రూ.20 లక్షలు దోచుకెళ్లారని చెప్పారు. అందుకు సాక్ష్యంగా.. తాము గాయాలతో ఉన్న ఓ వీడియోను వెంకటేశ్వర్లుకు పంపించారు. నిజానికి కోడి రక్తం ఒళ్లంతా పూసుకుని గాయాలు అయినట్లుగా బిల్డప్ ఇచ్చారు. పైగా రూ.20 లక్షలు పోయిన టెన్షన్లో ఉన్నామని చెప్పి.. తప్పించుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఊరుకోలేదు.. గాయాలకు చికిత్స చేసేందుకు రూ.10వేలు ఫోన్ పే చేయాలని కోరారు. అప్పటికి కూడా నిజమని నమ్మిన వెంకటేశ్వర్లు రూ.10వేలు చెల్లించాడు.
చివరకు తాను మోసపోయానని గ్రహించిన వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో మొత్తం 9 మంది నిందితుల్లో పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న, పసుపుల సత్యంను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 లక్షల 25 వేల నగదును, ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఐదుగురు నిందితులు పసుపుల నవీన్, ఓర్సు శ్రీను, ఓర్సు గోపమ్మ, పసుపుల లక్ష్మీ, మద్దంగుల అంజలి పరారీలో ఉన్నారు. ఇలా పురాతన బంగారు నాణేలు తక్కువ ధరకు ఇస్తామని ఎవరైనా చెబితే.. అది కచ్చితంగా మోసమేనని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఆఫర్లు ఎవరైనా ఇస్తే.. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.